Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిసున్న చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హన్మకొండలో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్లో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా చూడలేదని మా ఆవిడ నన్ను తిట్టింది. ఆమె అన్నాకా నేను ఆ సినిమా చూసాను. 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశాను. సినిమా చూడాలనిపించలేదు. ఆ కుర్రాడి మీద ఫోకస్ వెళ్ళింది. విజయ్ నటన చూసి ఇంత నిజాయితీగా ఏ హీరోనైనా నటిస్తాడా..? అతనితో సినిమా తీయాలని అప్పటినుంచే అనుకున్నాను.
సినిమాలోనే కాదు బయట కూడా విజయ్ నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టం.. లైగర్ సినిమాలో కూడా ఎంత ఎలివేషన్ పెట్టినా ఇంత పొగరు కనిపించదు. విజయ్ కోపంలో కూడా ఒక నిజాయితీ ఉంటుంది. తనకు ఒక నిర్మాతగా ఒక కోటి రూపాయలు ఇస్తే సినిమాకు ఖర్చుపెట్టమని చెప్తాడు. నిర్మాత కష్టాల్లో ఉంటే ఇచ్చిన రెండు కోట్లు కూడా తిరిగి ఇచ్చేస్తాడు. విజయ్ తండ్రి తన కొడుకును నా కొడుకులా చూసుకోమన్నారు. కానీ, విజయ్ నన్ను ఒక తండ్రిలా ట్రీట్ చేసి నా కష్టాల్లో, బాధల్లో పాలుపంచుకున్నాడు. హీరోలానే కాదు.. అన్ని విషయాల్లోనూ సినిమా కోసం పనిచేస్తాడు. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ పెట్టాలనే ఆలోచన ఛార్మీది. ఆమె వలనే ఇదంతా జరిగింది.
అమెరికాలో సెట్ మొత్తం వేసి మైక్ టైసన్ కోసం ఎదురుచూస్తున్నాం.. వస్తాడో రాడో అని భయం భయంగా చూస్తుంటే ఒక కారులో మైక్ దిగాడు. హమ్మయ్య వచ్చాడ్రా వీడు అని అనుకున్నా.. లెజెండ్ తో వర్క్ చేసే అవకాశం వచ్చింది.. మైఖేల్ జాక్సన్, బ్రూసిలీ తరువాత మైక్ టైసన్ ప్రతి ఒక్కరికి తెలుసు.. నేను విజయ్, మైక్ టైసన్ పక్కన కూర్చుంటే.. ఒక జంతువు పక్కన కూర్చున్నట్లు అనిపించేది. ఒక గుర్రం, ఏనుగు లా కనిపిస్తాడు. అంత లావుగా ఉంటాడు. అలాంటి అతనితో పనిచేయడం చాలా అదృష్టం.. ఇక అనన్య పాండే ఒక ఏంజెల్.. ఆడాళ్ళు మగాళ్ల మీద అరిస్తే చూడడానికి బావుంటుంది.. అలా ఉంటుంది.. ఛార్మీ.. సినిమా కోసం మగాళ్ల కంటే ఎక్కువ కష్టపడుతుంది. చాలా కష్టమైతే తప్ప నా దగ్గరకు రాదు. అన్ని ప్రాబ్లమ్స్ తట్టుకొని సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. లవ్ యూ ఛార్మీ..” అంటూ చెప్పుకొచ్చాడు