Puri Jagannadh Speech At Liger Pre Release Event: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందిన ‘లైగర్’ సినిమా ఆగస్టు 25వ తేదీన గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం భారీఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టింది. ఇందులో భాగంగానే గుంటూరులో ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ వేడుకలో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. మీరంతా ఒక్కో టికెట్ కొని మా సినిమాని చూసినా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆ ఈవెంట్‌కి వచ్చేసిన యువతని ఉద్దేశించి అన్నారు. తాము సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి వచ్చామా లేక సక్సెస్ టూర్‌కి వచ్చామా? అని తెలియడం లేదని.. ఆ స్థాయిలో ప్రాంగణం నిండిపోయిందని అన్నారు. విజయ్ అభిమానుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఉన్నారన్నారు.
విజయ్ ఈ సినిమాల ఇరగదీశాడని, అనన్యా పాండే చింపేసిందని, ఇక రమ్యకృష్ణ ఉతికి ఆరేసిందని పూరీ పేర్కొన్నాడు. ఇక తమ సినిమాలో హైలైట్ మైక్ టైసన్ అని, ఆయన ఒక లెజెండ్ అని కొనియాడాడు. తానిప్పుడు మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి ఒక కారణం ఉందంటూ.. ముంబైలో జరిగిన ఓ సంఘటనని గుర్తు చేసుకున్నారు. ముంబైలో ఒక రిపోర్టర్ ‘సార్ మైక్ టైసన్ ఎవరు’ అని అడిగారని.. ఆ ప్రశ్న తనని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు బాధ కలిగించిందని అన్నాడు. ఎంతో కష్టపడి మైక్ టైసన్‌లాంటి లెజెండ్‌ని తీసుకొస్తే, ఇతనేంటి? అంత సింపుల్‌గా ఎవరని అడిగేశాడేంటని తాను షాక్‌కి గురయ్యానన్నాడు. ఆయన్ను కొట్టే మొనగాడు ప్రపంచంలో ఎవరు లేరని, మైక్ టైసన్ కొట్టిన తర్వాత అక్కడ పైన కొట్టడానికి ఇంకెవరు లేరని మైక్ టైసన్‌ని ఆకాశానికెత్తేశాడు.
సినిమా చూడటానికి ముందు ఒకసారి గూగుల్‌లో మైక్ టైసన్ గురించి సెర్చ్ చేసి తెలుసుకోండని పూరీ కోరాడు. మైక్ టైసన్ గొప్పతనం తెలిస్తే, వెండితెరపై ఆయన ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేస్తారని.. అందుకే తాను మైక్ టైసన్ గురించి పదే పదే చెప్తున్నానన్నాడు. ఈ సినిమాని తాము ఎంతో ప్రేమగా రూపొందించామని చెప్పాడు. ‘‘ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా తెలీదు.. కానీ ఈ సినిమా కంటే డబుల్ బడ్జెట్‌తో జన గణ మన షూటింగ్ ప్రారంభించాం, ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. అంతా కాన్ఫిడెంట్‌గా లైగర్ మీద ఉంది’’ అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.