Parasakthi: తమిళనాడులో పొంగల్ బరిలో నిలిచిన సినిమాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’ సెన్సార్ కష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా మరో శివకార్తికేయన్ ‘‘పరాశక్తి’’ సినిమాపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్‌కు సంబంధించిన చారిత్రక సంఘటనలను వక్రీకరించారని ఆరోపిస్తూ, పరాశక్తి సినిమాపై బ్యాన్ విధించాలని తమిళనాడు యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
1960లలో విద్యార్థి ఉద్యమం, హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏకంగా 25 కట్స్ విధించింది. తమిళనాడు యూత్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. పరాశక్తి ఒక “డీఎంకే అనుకూల చిత్రం” అని, అందులో “తమిళ అనుకూల, హిందూ వ్యతిరేక వైఖరి” ఉందని ఆరోపించారు. పోస్టాఫీస్ ఫామ్స్‌లో కేవలం హిందీని మాత్రమే అనుమతించారని తప్పుగా చూపించారని, కాంగ్రెస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ఇలా చేశారని అన్నారు.
Read Also: Minister Nadendla: రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర రావాలి.. సంతోషంగా ఉండాలి..
‘‘1965లో, అన్ని రాష్ట్రాల్లో పోస్టాఫీసు ఫారాలను కేవలం హిందీలోనే నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. ఇది మా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా సృష్టించిన పూర్తి కల్పన’’ అని అన్నారు. హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ హీరో శివకార్తికేయన్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీన కలిసినట్లు చూపిస్తున్నారని, ఇది ఆమెను తక్కువ చేసి చూపే సన్నివేశమని అన్నారు. సినిమాలో చెప్పబడుతున్నట్లు ఇందిరాగాంధీ 1965 ఫిబ్రవరి 12 కోయంబత్తూర్ సందర్శనకు రాలేదని అన్నారు. ఇదంతా కల్పితమని కొట్టిపారేశారు. ఆమె సమక్షంలో రైలుకు నిప్పు పెట్టడం జరగలేదని అన్నారు.
ఈ సినిమా క్లైమాక్స్ కూడా వివాదాస్పదంగా మారింది. ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, కే కామరాజ్ రియల్ ఫోటోలను చూపిస్తూ, పొల్లాచిలో 200 మందికి పైగా తమిళుల్ని కాల్చి చంపినట్లు కాంగ్రెస్‌ను తప్పుగా నిందిస్తోందని భాస్కర్ ఆరోపించారు. ఇలాంటి సన్నివేశాలను తక్షణమే తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన పరాశక్తిలో శివకార్తికేయన్, రవి మోహన్, అధర్వ , శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు.