2017లో విడుదలైన ‘వానవిల్లు’ సినిమాలో హీరోగా నటించాడు ప్రతీక్ ప్రేమ్ కరణ్. మళ్ళీ ఇంతకాలానికి అతను ‘సదా నన్ను నడిపే’ మూవీలో కథానాయకుడిగా నటించాడు. విశేషం ఏమంటే ఈ మూవీలోని కీలక బాధ్యతలను ప్రతీక్ తన భుజాలకు ఎత్తుకున్నాడు. హీరో నటించడంతో పాటు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం వంటి బాధ్యతలను ప్రతీక్ ప్రేమ్ కరణ్ నిర్వహించడం విశేషం. వైష్ణవి పట్వర్ధన్, నాగేంద్రబాబు, డి.ఆర్. శేఖర్, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ, మహేష్ అచంట ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదలకాబోతుంది.
ఈ సందర్భంగా ప్రతీక్ మాట్లాడుతూ, ”నా మొదటి సినిమా ‘వానవిల్లు’తో చిత్రసీమపై పూర్తి అవగాహన వచ్చింది. ఇందులోని సాధక బాధకాలు తెలిశాయి. ఆ అనుభవంతో తెరకెక్కించిన సినిమానే ఇది. అయితే దీనిని మొదలు పెట్టాక కోవిడ్ సమస్య రావడంతో రెండేళ్ళ జాప్యం జరిగింది. బీటెక్ చదివిన నేను సినిమా మీద పిచ్చితో రంగంలోకి వచ్చాను. దర్శకుడు కావాలన్న కోరిక. బట్ అనుకోని పరిస్థితిలో హీరోగా మారాను” అని అన్నారు. ”ఇది ప్యూర్ లవ్‌స్టోరీ. మనకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోతున్నాడని తెలిశాక వారితో వున్న కొద్దిక్షణాలు ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటామో అది ఇందులో చూపించాం. ఇందులో ఎమోషన్‌కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ‘కలిసుందాం రా… గీతాంజలి’ తరహాలో సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. లహరి ఆడియో ద్వారా విడుదలైన పాటలకు చక్కని స్పందన లభిస్తోంది. ఈ మూవీని కొడైకెనాల్, కులు మనాలి, హైదరాబాద్, విజయవాడలో షూట్ చేశాం’ అని తెలిపారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నానని, ఆ తర్వాత మరో సినిమాకు కథ రెడీగా వుందని, వాటి వివరాలు త్వరలో తెలియచేస్తానని ప్రతీక్ ప్రేమ్ కరణ్ చెప్పారు.