‘జాంబీ రెడ్డి’, ‘అద్భుతం’ సినిమాల కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జల నుంచి వస్తున్న మూడో సినిమా ‘హను-మాన్’. తక్కువ బడ్జట్ లో అద్భుతాలు సృష్టించగలనని ఇప్పటికే ప్రూవ్ చేసిన ప్రశాంత్ వర్మ, ఈ సారి ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. హీరో కథకి ‘హనుమంతు’డిని లింక్ చేస్తే రూపొందుతున్న ఈ మూవీ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడ్జట్ కి విజువల్స్ కి సంబంధం లేదు, అంతతక్కువ బడ్జట్ లో ఆ రేంజ్ గ్రాఫిక్స్ వర్క్ ఎలా చేయగలిగారు అంటూ సినీ అభిమానులంతా ఆశ్చర్యపోయారు. రెండు సార్లు వాయిదా పడిన తర్వాత ‘హను మాన్’ టీజర్ నవంబర్ 21న బయటకి వచ్చింది. 01:41 నిమిషాల నిడివితో కట్ చేసిన ‘హను మాన్’ టీజర్ పాన్ ఇండియా రేంజులో కాంప్లిమెంట్స్ తెచ్చుకుంది.
విజువల్ ట్రీట్ అనే పేరు తెచ్చుకున్న ‘హను మాన్’ టీజర్ 50మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్ ని రాబట్టింది. ఈ సంధర్భంగా హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ‘హను మాన్’ రిలీజ్ డేట్ ఇంకా బయటకి రాలేదు కానీ అప్పుడే ‘హను మాన్’ సినిమా తెలుగు నుంచి రాబోయే నెక్స్ట్ పాన్ ఇండియా హిట్ అవుతుందంటూ ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ సినిమా నార్త్ లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటివలే రిలీజ్ అయిన ‘కాంతార’ సినిమా కూడా నార్త్ లో సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ రెండు సినిమాల్లో ఉన్న ఒక కామన్ పాయింట్, నార్త్ లో ‘హను మాన్’కి కూడా కలిసి రానుందని అంతా అనుకుంటున్నారు. అదే జరిగితే ఒక చిన్న సినిమాగా, ఒక చిన్న హీరోతో రూపొందిన ‘హను మాన్’ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయినట్లే.