Unstoppable 2: కథలేకుండానే కనికట్టు చేయగల సత్తా ఉన్న స్టార్స్ ఎవరంటే ఒకరు నటసింహ బాలకృష్ణ, మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని టాలీవుడ్ జనం అంటూ ఉంటారు. అలాంటి ఇద్దరు పవర్ ఫుల్ స్టార్స్ ఒకే వేదికపై కలుసుకోవడం నిస్సందేహంగా వారిద్దరి ఫ్యాన్స్ కు కన్నుల పండగే! ‘ఆహా’లో బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారని అప్పట్లో వినిపించింది. ఇప్పుడు అది సాకారం కాబోతోంది. త్వరలోనే బాలయ్య నిర్వహించే టాక్ షోలో పవన్ కళ్యాణ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారని రూఢీగా తెలుస్తోంది.
మిగతా హీరోలకు లేని ప్రత్యేకతలు ఈ ఇద్దరు హీరోలకు ఉన్నాయి. ఇద్దరూ మాస్ లో తమదైన బాణీ పలికించిన వారే! యన్టీఆర్ నటవారసునిగా బాలయ్య జయకేతనం ఎగురవేస్తే, చిరంజీవి తమ్మునిగా అభిమానులను విశేషంగా మురిపించారు పవన్. 2001లో బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ జనాన్ని ఎంతగా అలరించాయో చెప్పక్కర్లేదు. ఆ రెండు చిత్రాలు ఈ ఇద్దరు హీరోల కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచాయి. ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వార్ లో తక్కువసార్లు పాలుపంచుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యునిగా తనదైన బాణీ పలికిస్తోంటే, ‘జనసేనాని’గా పవన్ తనకంటూ ఓ స్పెషల్ రూటులో సాగుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పొత్తు ఉంటుందని విశేషంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య టాక్ షోలో పవన్ గెస్ట్ గా రావడం మరింత విశేషంగా మారింది. మరి బాలయ్య- పవన్ కళ్యాణ్ షో అంటే అభిమానులకు ఏ తీరున కిక్ ఉంటుందో చెప్పక్కర్లేదు. మరి అది ఎప్పుడు ఎలా అన్న వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ గ్లింప్స్ తో అన్ స్టాపబుల్ అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. ఇప్పుడు బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ కూడా తోడైతే.. దబిడి దబిడే!