హరి హర వీరమల్లు సినిమా సెట్స్ మీదకి వెళ్లి చాలాకాలమే అవుతోంది. నిజానికి, భీమ్లా నాయక్ కంటే ముందే ఆ సినిమా షూటింగ్ మొదలైంది. ఆ లెక్క ప్రకారం.. హరి హర వీరమల్లు ఎప్పుడో రిలీజ్ అయిపోవాలి. కానీ, అలా జరగలేదు. మధ్యలో చాలాకాలం గ్యాప్ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ ఇటు కొండపొలం, పవన్ అటు భీమ్లా నాయక్ పనుల్లో బిజీ అయిపోయారు. తమతమ పనులు ముగించుకున్న తర్వాతైనా ‘హరి హర వీరమల్లు’ పనుల్ని వేగవంతం చేశారా? అంటే అదీ లేదు. కొన్ని సన్నివేశాలైతే చిత్రీకరించారు కానీ, ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చారు. దీంతో, ఈ సినిమా ఎప్పుడు ముగుస్తుందన్న సందేహం తెరమీదకి వచ్చింది.
ఇది చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతోన్న సినిమా కాబట్టి, ఫ్యాన్స్ సహా సినీ ప్రియులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకే, ఈ సినిమా ఎప్పుడు ముగుస్తుందని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎంతోకాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా పనుల్ని వేగవంతంగా ముగించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. పవన్ తన రాజకీయ వ్యవహారాల నుంచి ఫ్రీ అయిన వెంటనే, సెట్స్ మీదకి వెళ్ళేందుకు క్రిష్ సిద్ధంగా ఉన్నాడు. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా, జూన్‌లోపే షూటింగ్ కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మునుపటిలాగా ఈసారి పనుల్లో జాప్యం అవ్వకుండా క్రిష్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలిసింది. మరి, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా?
మరోవైపు.. జూన్ నెల నుంచి ‘వినోదయ సీతమ్’ రీమేక్‌ని ప్రారంభించాలని దర్శకుడు సముద్రఖని తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. ఒరిజినల్ తానే నటించి దర్శకత్వం వహించిన ఈయన.. సంక్రాంతికే ఈ సినిమాను తీసుకురావాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు. అటు, హరీశ్ శంకర్ కూడా భవదీయుడు భగత్‌సింగ్ సినిమాని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలా? అని కాచుకొని కూర్చున్నాడు.