Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. కుటుంబాన్ని, పండగలను, పిల్లలను అన్ని మర్చిపోయి ప్రజల కోసం పోరాడుతున్నాడు. వారి సమస్యలను పరిష్కరించాలని ఆరాటపడుతున్నాడు. ఒక స్టార్ హీరోగా ఏసీ కార్లలో తిరుగుతూ.. ఏడాదికి ఒక సినిమా చేస్తూ కోట్లు సంపాదించొచ్చు. కానీ, పవన్ ఆ దారిని వదిలి.. ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజలకు ఏదో ఒకటి చేయాలనీ జనసేన ను స్థాపించి.. ఎన్నో విమర్శలను ఎదుర్కుంటూ ముందుకు వెళ్తున్నాడు. అపజయాలు వచ్చినా పట్టించుకోకుండా.. విజయం కోసం ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు పండగ వచ్చిందంటే.. పవన్ సినిమా పోస్టర్ లతో సందడిగా కనిపించేది. మెగా ఫ్యామిలీ ఫోటో వచ్చిందంటే.. ముగ్గురు అన్నదమ్ములు రామ లక్ష్మణులా కనిపించేవారు.. ఆ ఫొటోస్ కోసం అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
కుటుంబమంతా సంక్రాంతి సంబురాల్లో మునిగితేలుతుంటే.. పవన్ మాత్రం ఏపీ ఎలక్షన్స్ ప్రచార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. కొద్దిసేపటి క్రితమే.. మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉన్న ఒక ఫోటోను చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందరికీ సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలో మెగా- అల్లు కుటుంబం చిన్నా పెద్దా.. కోడళ్లు, అల్లుళ్లు అందరూ కనిపించారు. ఒక్క పవన్ తప్ప. ఈ ఫోటో చూసిన అభిమానులు.. మెగా కుటుంబం మొత్తం ఒక ఫ్రేమ్ లో ఉన్నందుకు ఆనందపడాలో.. జనసేనాని లేడే అని బాధపడాలో తెలియని పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం పవన్ ఏపీలోనే ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఏదిఏమైనా ఆ ఫోటోలో పవన్ ఉంటే.. ఆ పండగ వేరే లెవెల్లో ఉండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.