భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన ఆచార్య సినిమాపై ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ కరెక్ట్ కాదని, సిద్ధ పాత్రలోనూ రామ్ చరణ్ చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన బాంబ్ పేల్చారు. సంగీతమూ సరిగ్గా కుదరలేదంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘‘ఈమధ్యకాలంలో ఎర్ర సినిమాలు రావడం లేదు. ఇలాంటి టైంలో ఒక ఎర్ర సినిమా తీయాలని కొరటాలకు కోరిక పుట్టడం, దానికి చిరంజీవి అంగీకారం తెలపడంతో ఆచార్య రూపుదిద్దుకుంది. సినిమాగా చూస్తే ఆచార్యలో తప్పులేమీ లేవు కానీ.. ముఖ్యమైన సంఘటన ఏంటి? ఎందుకు, ఎలా జరిగింది? అనేది చెప్పకుండా కథని నడిపించిన తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే చోట ఇమడవు. డైలాగ్స్, కథాంశం, పెర్ఫార్మెన్స్‌లు బాగున్నా.. ఇప్పుడు కమ్యూనిజం భావజాలం ఉన్న సినిమాలు ఆడియన్స్‌కి నచ్చడం లేదు’’ అని అన్నారు.
అంతేకాదు.. ‘‘రామ్ చరణ్‌తో సిద్ధ పాత్ర చేయించకుండా ఉంటే బాగుండేదేదేమో. ఫ్యాష్‌బ్యాక్ కేవలం 10% ఉంచి, 90% మొత్తం చిరు ఉండుంటే.. సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. సంగీతం కూడా సరిగ్గా కుదరలేదు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పాత్రలో చిరు స్టెప్పులు వేయకుండా ఉండాల్సింది. కథ ప్రకారం చూసుకుంటే.. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ కూడా కరెక్ట్ కాదు’’ అంటూ పరచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.