Saidharam / Vaishnav Tej: మెగా బ్రదర్స్, అల్లు బ్రదర్స్ తరహాలోనే టాలీవుడ్ లో ఇప్పుడు పంజా బ్రదర్స్ కూడా తమ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి మేనల్లుళ్ళు పంజా సాయిధరమ్ తేజ్, అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా స్థిరపడగా, తొలి చిత్రం ‘ఉప్పెన’తో గ్రాండ్స్ సక్సెస్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఆటుపోటులను ఎదుర్కొంటున్నాడు. ‘ఉప్పెన’ తర్వాత వచ్చిన రెండు సినిమాలూ వైష్ణవ్ తేజ్ ను నిరాశ పరిచాయి. ఇదిలా ఉంటే… అతని నాలుగో సినిమా ‘ఆది కేశవ’ను జూలై నెలలో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
జూలై మాసంలోనే వైష్ణవ్ తేజ్ అన్న సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా కూడా జనం ముందుకు రాబోతోంది. తమిళంలో చక్కని విజయాన్ని అందుకున్న ‘సీతాయవినోదం’ తెలుగు రీమేక్ ను పీపుల్స్ మీడియా సంస్థ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తో నిర్మిస్తోంది. మాతృకకు రూపొందించిన నట దర్శకుడు సముతిర కని తెలుగు సినిమానూ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని జూలై 28న విడుదల చేస్తామని గతంలోనే పీపుల్స్ మీడియా అధినేత టి.జి. విశ్వప్రసాద్ తెలిపారు. గురువారం ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ డేట్ కు నిర్మాతలు కట్టుబడి ఉంటే ఒకే నెలలో పంజా బ్రదర్స్ సినిమాలు విడుదల అవుతాయి. పవన్, సాయిధరమ్ తేజ్ మూవీ ద్వితీయార్ధంలో విడుదలవుతుంది కాబట్టి ప్రథమార్ధంలో ‘ఆది కేశవ’ వచ్చే ఆస్కారం ఉంటుంది. గతంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు నటించిన సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ వచ్చాయి. 2021 అక్టోబర్ 1న సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ విడుదల కాగా, ఆ తర్వాత వారం రోజులకే వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’ అక్టోబర్ 8, 2021న జనం ముందుకు వచ్చింది. దేవా కట్ట రూపొందించిన ‘రిపబ్లిక్’ విమర్శకుల ప్రశంసలు అందుకోగా, క్రిష్ తెరకెక్కించిన నవలా చిత్రం ‘కొండపొలం’ పరాజయం పాలైంది. మరి ఇప్పుడు పవన్, సాయిధరమ్ తేజ్ – వైష్ణవ్ తేజ్ చిత్రాలలో ఏది జనాలను మెప్పిస్తుందో చూడాలి.