హాలీవుడ్ డైరెక్టర్ పాల్ హగ్గిస్ పేరు ఫిలిమ్ బఫ్స్ కు సుపరిచితమే! ఆయన రచనతో తెరకెక్కిన ‘మిలియన్ డాలర్ బేబీ’, ‘క్రాష్’ చిత్రాలు ఆస్కార్ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. ‘క్రాష్’ ద్వారా ఆయనకు నిర్మాతగా, రచయితగా కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. 69 ఏళ్ళ హగ్గిస్ ను ఇప్పటికీ కొందరు రొమాంటిక్ అంటూ కీర్తిస్తుంటారు. అందులో నిజానిజాలు ఏమో కానీ, ఓ రేప్ కేసులో హగ్గిస్ ను ఇటలీ పోలీసులు ఆదివారం (జూన్ 19న) అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ హగ్గిస్ పై సెక్సువల్ ఎరాస్ మెంట్ కేసులు కొన్ని నమోదయ్యాయి.
ఇప్పటి విషయానికి వస్తే, ఈ నెల 21 నుండి 26 వరకు ఇటలీలో జరగనున్న ‘అలోరా ఫెస్ట్’ కోసం హగ్గిస్ ఇటలీలో అడుగు పెట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఓ విదేశీ వనిత, ఎయిర్ పోర్ట్ సమీపంలో కనిపించింది. ఆమెకు చికిత్స చేసిన తరువాత వివరాలు అడగితే, తనను హాలీవుడ్ డైరెక్టర్ పాల్ హగ్గిస్ బలాత్కారం చేసినట్టు తెలిపింది. ఆమె స్టేట్ మెంట్ ఆధారంగా ఇటలీ పోలీసులు హగ్గిస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వెలుగు చూసిన వెంటనే అమెరికాలోనూ అతగాడు అదే పని చేశాడంటూ కొందరు వనితలు బహిర్గతం చేశారు. కానీ, హగ్గిస్ లాయర్ ప్రియా చౌదరి మాత్రం ఇవి పుకార్లేనని వాటిలో ఏ మాత్రం వాస్తవాలు లేవని అంటోంది. తన క్లయింట్ పాల్ హగ్గిస్ విచారణకు అన్నివిధాలా సహకరిస్తాడని, తరువాత ఆయన నిర్దోషి అని కూడా తేలుతుందని ప్రియ అంటోంది. మరి ఆస్కార్ అవార్డు విజేతగా నిలచిన హగ్గిస్ కథ ఏమవుతుందో చూడాలి.