Om Bheem Bush Trailer: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ముగ్గురు యువకులు.. బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సొల్యూషన్స్ ను మొదలుపెడతారు. ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తామని ఊర్లు తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ముగ్గురు వివిధ సమస్యలకు పరిష్కారంగా ట్యాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతుంటారు.
ఇక వారి వ్యాపారం పుంజుకున్నప్పుడు, కొంతమంది అఘోరాల సమూహం గ్రామంలోకిప్రవేశించి, సంపంగి మహల్‌లో ఉన్న రహస్య నిధిని కనుగొనమని సవాలు విసురుతారు. ఇక ఆ సవాల్ ను స్వీకరించిన బ్యాంగ్ బ్రోస్.. ఆ మహల్ లోకి అడుగుపెడతారు. మిగిలిన కథ హాంటెడ్ హౌస్‌లో నిధిని కనుగొనడానికి బ్యాంగ్ బ్రోస్ యొక్క పోరాటాలని గురించి అని తెలుస్తోంది. ఎంటర్ టైన్మెంట్, యువతను ఆకట్టుకునే అంశాలు కాకుండా, ట్రైలర్ సూచించినట్లుగా సినిమాలో ట్రెజర్ హంట్, హారర్, థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు ఉన్నాయి. ఇక ఈ ముగ్గురు హీరోల కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముందే వీరు బ్రోచేవారెవరురా సినిమాతో ప్రేక్షకులను అలరించారు. చూసిన కాంబోనే కావడంతో నవ్వుకు డోకా లేదని తెలుస్తోంది. సినిమాకు ముందే లాజిక్స్ లేవు అని రాశారు కాబట్టి.. ఎలాంటి లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే మాత్రం మూడుగంటలు నవ్వుకోవడం పక్కా అని తెలుస్తోంది. మరి ట్రైలర్ చూసి నవ్వుకున్న ప్రేక్షకులను థియేటర్ లో ఎలా నవ్విస్తారో చూడాలంటే మార్చి 22 వరకు ఆగాల్సిందే.