O Kala: గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ హీరోహీరోయిన్లుగా దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మించిన చిత్రం ‘ఓ కల’. ఈ మూవీ ఈ నెల 13న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ, ‘‘తెలుగు సినిమాకి మంచి గుర్తింపుని తీసుకు వచ్చిన దర్శకనిర్మాతలు గుణ్ణం గంగరాజు, చంద్రశేఖర్ యేలేటి. వీళ్ళ చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ సాంగ్ ఆవిష్కరణ జరిగింది. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. ఇది చక్కని ప్రేమకథ. హీరో గౌరీశ్.. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి గారికి బంధువు. ప్రతి సీన్ ని చక్కగా అర్థం చేసుకుని నటించాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో హకరించారు. నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. మంచి ప్రేమ కథను మనవాళ్ళు చూసి చాలా కాలం అవుతుంది. ఆ లోటును మా చిత్రం తీరుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను’’ అని తెలిపారు. ఈ సినిమాలో అలీ, వైవా రాఘవ్, దేవి ప్రసాద్, శక్తి, రవితేజ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. నీలేష్ మందలపు సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి అఖిల్ వల్లూరి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.