తరగని కళాతృష్ణ, చెరిగిపోని నటనాపిపాస వెరసి నటరత్న యన్.టి.రామారావు అని అంటే అతిశయోక్తి కాదు. తెరపై పట్టువదలని విక్రమార్కునిగా నటించిన యన్.టి.రామారావు నిజజీవితంలోనూ అదే తీరున సాగారు. ఓ సారి తలచుకుంటే, దానిని సాధించేదాకా నిదురపోని నైజం యన్టీఆర్ ది! ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం పరిఢవిల్లడానికి కారణమైన సమ్రాట్ అశోకుని పాత్ర పోషించాలన్న తలంపు యన్టీఆర్ మదిలో బ్రహ్మంగారి చరిత్ర చిత్రం రూపకల్పన సమయంలోనే నాటుకుంది. తరువాత రాజకీయ ప్రవేశం, ఆ తరువాత రాజకీయాల్లోనూ ఆయన జైత్రయాత్ర, ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు. ప్రజాస్వామ్యాన్ని కూల్చినపుడు పోరాటాలు, తిరిగి అధికారం చేజిక్కించుకోవడం వంటి పలు పర్వాలతో రామారావు బిజీగా గజిబిజిగా ఉన్నారు. 1989లో తన తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసినప్పుడు కూడా చిరునవ్వుతోనే, “ఇది ప్రజాతీర్పు… శిరసావహిస్తాం…” అంటూ ప్రతిపక్షనాయకునిగానూ ప్రజల పక్షం నిలచి పోరాటాలు చేసిన ఘనచరిత్ర యన్టీఆర్ సొంతం. ఆ సమయంలో కాసింత వీలు చిక్కగానే తన మనసులో స్థిరవాసం ఏర్పరచుకున్న అశోకుని కథను తెరకెక్కించాలని భావించారు. మరో ఆలోచన లేకుండా ముందుకు సాగారు. తత్ఫలితంగా 1992 మే 28న తన పుట్టినరోజు కానుకగా ‘సమ్రాట్ అశోక’ చిత్రాన్ని తెలుగువారికి అందించారు యన్టీఆర్. ఈ సినిమాయే ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం. ఆ సినిమా విడుదల రోజునే యన్టీఆర్ 69 ఏళ్ళు పూర్తి చేసుకొని 70వ యేట అడుగుపెట్టడం విశేషం! ఆ రోజున సాగిన మహానాడు సైతం అభిమానులకు ఆనందం పంచింది.
చరిత్రలో అశోకునికి సంబంధించిన ఆధారాలతో యన్టీఆర్ రాసుకున్న కథకు నెట్యం రతన్ బాబు రచనతో ఈ ‘సమ్రాట్ అశోక’ చిత్రం తెరకెక్కింది. ఉజ్జయినీ రాజకుమారి తిష్యరక్షను కళ్యాణం నుండి అశోకుడు ఎత్తుకు రావడంతో కథ ఆరంభమవుతుంది. తరువాత ఫ్లాష్ బ్యాక్ లో అశోకుడు ఎలా తన తండ్రి బిందుసారుణ్ణే ఎదిరిస్తాడు. తనయుని వీరత్వం చూసి, బిందుసారుడు తన తాత చంద్రగుప్తుడు ఇచ్చిన కార్తికేయ ఖడ్గాన్ని అశోకునికి ఇచ్చి, ఆశీర్వదిస్తాడు. తరువాత అశోకుడు అనేక యుద్ధాలు చేస్తూ రాజ్యాన్ని విస్తరిస్తూ పోతాడు. తిష్యరక్ష పరిచయం దాకా అలా సాగుతుంది. ఆపై కళింగపైకి యుద్ధానికి బయలు దేరతాడు. వాచాలి అనే పసిపాప అశోకుని సైన్యాన్ని అడ్డగిస్తుంది. ఆమె కారణంగా అశోకునిలో కొంత మార్పు వస్తుంది. అయితే అశోకుని భార్య తిష్యరక్ష కూడా యుద్ధంలో తన భర్తకు సాయంగా వస్తుంది. ఆమె వైరి పదునైన కత్తికి బలి అవుతుంది. దాంతో అశోకుడు కళింగపైకి దండెత్తి రక్తం ఏరులై పారించి, ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. రక్తపు మడుగులా మారిన రణభూమిని చూసి అశోకుడు చలించిపోతాడు. అక్కడే ఓ తల్లి ఆక్రందన ఆయనలో మార్పు తీసుకు వస్తుంది. బౌద్ధం స్వీకరించి, దాని ప్రచారం కోసం పాటు పడటానికి నిర్ణయించుకుంటాడు అశోకుడు. ఆయన శాంతి మార్గం చిహ్నంగా మన జాతీయ పతాకం మధ్యలో అశోకచక్రం కొలువై ఉన్న వైనాన్ని చూపుతూ కథ ముగుస్తుంది.
రామకృష్ణా హార్టీ కల్చరల్ సినీ స్టూడియోస్ పతాకంపై యన్టీఆర్ దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా వాణీ విశ్వనాథ్ నటించారు. ఇందులో చాణక్యునిగానూ యన్టీఆర్ దర్శనమిచ్చారు. మిగిలిన పాత్రల్లో భానుమతి, బి.సరోజాదేవి, లక్ష్మి, స్వప్న, మోహన్ బాబు, సత్యనారాయణ, కాంతారావు, రామకృష్ణ , రంగనాథ్, గుమ్మడి, రతన్ బాబు, ధూళిపాల, మల్లాది,
ఈ సినిమాకు యన్టీఆర్ పెద్దకొడుకు జయకృష్ణ సమర్పకుడు కాగా, నిర్మాణతను ఆయన మూడో కుమారుడు హరికృష్ణ నిర్వహించారు. ఈ చిత్రానికి నాలుగవ కుమారుడు నందమూరి మోహనకృష్ణ ఛాయాగ్రాహకులు. యన్టీఆర్ ఆరో తనయుడు నందమూరి రామకృష్ణ నిర్వహణ సాగించారు. ఈ చిత్రానికి యమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం సమకూర్చారు. సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు. “ఓ రామో రామా… నా సందామామా…”, “కించిత్ కించిత్ కిలికించితం…”, “అనురాగిణిగా… సహభాగినిగా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
అంతకు ముందు యన్టీఆర్ దర్శకత్వం వహించి, నిర్మించి, నటించిన చిత్రాలు అనేకం జననీరాజనాలు అందుకున్నాయి. అయితే ఆ స్థాయిలో ‘సమ్రాట్ అశోక’ ఆదరణ పొందలేక పోయింది.