Uma Maheswari: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఎల్లుండి జరగనున్నాయి. అమెరికాలో ఉన్న ఆమె పెద్ద కుమార్తె, అల్లుడు ఇండియాకు రావాల్సి ఉంది. వాళ్లిద్దరూ వచ్చిన తర్వాతే అంత్యక్రియలను నిర్వహించాలని నందమూరి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మరోవైపు ఉమా మహేశ్వరి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె కళ్లను కుటుంబీకులు దానం చేశారు. భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలించారు.
కాగా ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ ఎన్టీఆర్ గారి చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి గారి హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మధ్యనే కుటుంబ సభ్యులందరం కలుసుకుని ఆనందంగా గడిపాం. ఇంతలోనే ఇంతటి విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరం. ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ గారి చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి గారి హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మధ్యనే కుటుంబ సభ్యులందరం కలుసుకుని ఆనందంగా గడిపాం. ఇంతలోనే ఇంతటి విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరం.(1/2) pic.twitter.com/LuXBdrVcnB
— N Chandrababu Naidu (@ncbn) August 1, 2022
కాగా ఉమామహేశ్వరిది సహజ మరణం కాదని.. ఆమె తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు. ఉదయం 10 గంటలకు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆమె మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో పనిమనిషి మధ్యాహ్నం 12 గంటల సమయంలో తలుపు తట్టి ఆమెను పిలవడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో మరోసారి పనిమనిషి లేపే ప్రయత్నం చేసినట్లు వివరించారు. గతంలోనూ చాలా సార్లు తలుపులు వేసుకుని గంటల తరబడి గదిలోనే ఉమామహేశ్వరి ఉండేదని.. ఈరోజు కూడా అలాగే గదిలో ఉన్నారని.. గాఢనిద్ర పోతున్నారని ఎవరూ బలవంతంగా లేపే ప్రయత్నం చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చిన్న కూతురు, అల్లుడు తలుపులు బలవంతంగా నెట్టి లోపలకు వెళ్లి.. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఉమామహేశ్వరిని చూశారని.. వెంటనే చున్నీని కట్ చేసి డెడ్‌బాడీని కిందకు దించారని తెలిపారు. మరోవైపు ఉమామహేశ్వరి భర్త మూడురోజులుగా ఇంట్లో లేడని సమాచారం. ఆమె మరణవార్త తెలుసుకుని ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.