తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో అన్నగా నందమూరి తారక రామారావు గారు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా రాజకీయ వేదిక అయినా కోట్లాది మంది ప్రజానీకం మనసులో యుగ పురుషుడుగా నిలిచారు నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు జాతిపై చేసిన సంతకం మరువలేనిది. ఈ ఏడాది మే 28 నుండి ఎన్టీర్ శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ శతజయంతి వేడుకలు హిందూపురం ఎమ్మెల్యే, ‘నటసింహ’ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో ఈ వేడుకలు మే 28 ఉదయం బాలకృష్ణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆపై మధ్యాహ్నం గుంటూరు లో, సాయంత్రం తెనాలిలో వేడుకలు జరగనున్నాయి. ఈ శతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా జరగనున్న కార్యక్రమాలు సైతం బాలకృష్ణ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు సైతం భారీగా పాల్గొనబోయే ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయటం జరుగుతుంది.