వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ చిత్రం ఈ నెల 8న జనం ముందుకు రాబోతోంది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించినట్టుగా చిత్ర నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ధు చెబుతున్నారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో రూ. 200 ప్లస్ జీఎస్టీ ఉంటుందని, సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీ తో కలిపి టిక్కెట్ ధర రూ. 150 ఉంటుందని చెబుతున్నారు. నిజానికి ఇది సినిమా రేట్లను తగ్గించడం ఎంతమాత్రం కాదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ టిక్కెట్లను అమ్ముతున్నారు. ఆ మధ్య ‘దిల్’ రాజు వంటి ఎగ్జిబిటర్స్ కొందరు పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించమని ప్రభుత్వాన్ని కోరారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మీడియం బడ్జెట్ సినిమాల టిక్కెట్ రేట్లనూ ఎగ్జిబిటర్లు పెంచేశారు. వాటి కలెక్షన్ల మీద టిక్కెట్ రేట్ల పెంపు ప్రభావం పడటంతో తగ్గించుకున్నారు.
ఇక ‘ట్రిపుల్ ఆర్’ వంటి భారీ బడ్జెట్ సినిమా విషయంలో ఎగ్జిబిటర్లు అంతకు మించి అన్నట్టుగా స్పెషల్ జీవోతో ప్రేక్షకుల నుండి డబ్బులు దండుకున్నారు. అయితే అలాంటివేవి లేకుండా రెగ్యులర్ గా సినిమా టిక్కెట్ రేట్ ఎంత ఉంటుందో అంతకే ‘గని’ సినిమాను తెలంగాణలో ప్రదర్శించబోతున్నారు. ఇదిలా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’కు టిక్కెట్ రేట్లను భారీగా పెంచడంతో సామాన్య జనం థియేటర్ కు వెళ్ళడానికి భయపడుతున్నారు. దాంతో ఆ తర్వాత వారం జనం ముందుకు వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాన్ని ‘రీజనబుల్ రేట్ల’కే ప్రదర్శిస్తున్నామంటూ ఆ సినిమా నిర్మాతలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.