చూడగానే మనకు బాగా పరిచయం ఉన్న అబ్బాయిలా కనిపిస్తాడు. మన పక్కింటి కుర్రాడే అనిపిస్తాడు నిఖిల్ సిద్ధార్థ్! తనదైన చలాకీ అభినయంతో సాగుతున్న నిఖిల్ నవతరం ప్రతినిధిగా కనిపించే పాత్రల్లో సాగుతున్నాడు.
నిఖిల్ సిద్ధార్థ్ 1985 జూన్ 1న హైదరాబాద్ లో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత ‘ముఫ్పఖమ్ ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’లో బి.టెక్, చదివాడు. అతని మనసు చదువుకొనే రోజుల నుంచీ సినిమాలపైనే లగ్నమయింది. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా బుద్ధిగా చదువుకున్నాడు కానీ, సినిమాలవైపే పరుగు తీశాడు. ‘హైదరాబాద్ నవాబ్స్’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. తరువాత కొన్ని చిత్రాల్లో బిట్ రోల్స్ లోనూ కనిపించాడు. శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’లో రాజేశ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు నిఖిల్. అతను హీరోగా రూపొందిన ‘యువత’ భలేగా అలరించింది.
ఈ చిత్రం ద్వారానే ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ తొలిసారి మెగాఫోన్ పట్టాడు. ‘యువత’తో మంచి పేరు సంపాదించిన నిఖిల్ ఆ పై”ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, స్వామి రా రా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం” వంటి చిత్రాలతో మురిపించాడు.
ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందిన ‘కార్తికేయ-2’ జూలై 22న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇవి కాక “18 పేజెస్, స్పై” అనే చిత్రాల్లోనూ నిఖిల్ హీరోగా నటించాడు. ఈ రాబోయే చిత్రాలతో నిఖిల్ ఏ తీరున అలరిస్తాడో చూడాలి.