నందమూరి బాలకృష్ణకు 2021 బాగా అచ్చివచ్చిందనే చెప్పాలి. ఆయనకు అన్నీ మంచి శకునములే కనిపించాయి. ఓ వైపు తొలిసారి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ భలేగా దూసుకుపోతోంది. అలాగే ఆయన నటించిన ‘అఖండ’ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మధ్యే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో ఎనిమిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మొదట్లో బాలయ్య తడబడినట్టు కనిపించినా తరువాత నుంచీ తనదైన బాణీ పలికిస్తూ ప్రతి ఎపిసోడ్ నూ రేటింగ్ లో టాప్ లో నిలుపుతున్నారు. ఇటీవల ‘ఇంటర్నెట్ మూవీ డేటాబేస్’ (ఐఎమ్.డి.బి) ఇండియాలో సాగుతోన్న టాక్ షోస్ పై ఓ సర్వే నిర్వహించింది. అందులో బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’ 9.7 పాయింట్లతో నంబర్ వన్ స్థానం ఆక్రమించుకోవడం విశేషం!
ఐ.ఎమ్.డి.బి. సంస్థ తరచూ సినిమాలపైనా, టాక్ షోస్, టీవీ సీరీస్ కు రేటింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా సాగుతుందంటే – తక్కువ సమయంలో ఎక్కువమందిని ఆకట్టుకున్న లెక్కలు తీసి గ్రేడింగ్ ఇస్తారు. అలాగే వ్యూయర్స్ రేటింగ్ నూ పరిగణనలోనికి తీసుకుంటారు. ఆ తీరున బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’ టాక్ షో కు ఇప్పటి దాకా రేటింగ్ లో 9.7 శాతం మార్కులు సంపాదించి, అన్నిటి కన్నా మిన్నగా నిలచింది. ఈ జాబితాలో అన్ని టీవీ సీరీస్ కలిపి దాదాపు ‘టాప్ 50’ తీశారు. అందులో బాలయ్య షో అగ్రగామిగా నిలవడం విశేషం.
Read Also : సినిమా టికెట్ ధరలు తగ్గించి గొప్పలా..? సిమెంట్ ధరలు తగ్గించొచ్చుగా..!
బాలయ్య టాక్ షో ‘అన్ స్టాపబుల్’ తరువాతి స్థానంలో కమెడియన్ కపిల్ శర్మ సోనీ టీవీ ఎంటర్ టైన్ మెంట్ కోసం నిర్వహిస్తోన్న ‘ద కపిల్ శర్మ షో’ 7.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలచింది. ఇది 2016 నుండి ప్రసారమవుతోంది. అర్మాన్ అండ్ ఐశ్వర్య నిర్వహిస్తోన్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ పదో స్థానంలో నిలచింది. ఇది కూడా 2021లోనే ఆరంభమయింది. ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ 4.9 పాయింట్ల రేటింగ్ సాధించినా, తొమ్మిదో స్థానం ఆక్రమించింది. 2018 నుండి ఈ షో సాగుతోంది. మన తెలుగు హీరో రానా నిర్వహించిన ‘మెక్ డౌల్స్ నంబర్ వన్ యారీ విత్ రానా’ 7.9 పాయింట్లతో ఎనిమిదో స్థానం చేజిక్కించుకుంది. 1992 నుండి 2020 వరకు సాగిన ‘ఆప్ కీ అదాలత్’ 7.6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలచింది. 2012 నుండి 2014 దాకా సాగిన ఆమిర్ ఖాన్ నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ 8.6 పాయింట్లతో ఆరో స్థానం కైవసం చేసుకుంది. 2013 నుండి 2016 దాకా నవ్వుల పువ్వులు పూయించిన ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ 8.0 రేటింగ్ తో అయిదో స్థానంలో నిలచింది. 2014 నుండి కొనసాగుతోన్న ‘చలా హవా యూ ద్యా’ మరాఠీ హాస్యప్రధాన కార్యక్రమం 8.7 పాయింట్లతో నాలుగో స్థానం సంపాదించింది. 2004 నుండి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ 7.0 పాయింట్లతో మూడో స్థానం చూసింది.
మన మరో తెలుగు నటుడు ఆలీ నిర్వహిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ షో 2016 నుండి ఈ-టీవీలో ప్రసారమవుతోంది. ఈ షో 29వ స్థానంలో నిలచింది.
ఈ లెక్కలు ఎలా వేస్తారంటే, ఓ టాక్ షో ఎంత కాలం ప్రసారమయింది? ఎన్ని ఎపిసోడ్స్ ప్రసారమయింది? ఆడియెన్స్ రేటింగ్ లో వాటికి వచ్చిన పాయింట్స్ ఏంటి అన్నవి పరిగణనలోకి తీసుకుంటారు. ఆపై ఐ.ఎమ్.డి.బి రేటింగ్ ఉంటుంది. అలా ఈ సారి నంబర్ వన్ గా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’ నిలచింది. బాలకృష్ణ తాను నిర్వహిస్తోన్న తొలి టాక్ షోతోనే ఇండియాలో నంబర్ వన్ షోగా దానిని నిలపడం ఓ విశేషమయితే, ఇంతకు ముందు అగ్రస్థానంలో నిలచిన అన్ని టాక్ షోస్, శాటిలైట్ టీవీ ఛానెల్స్ లో ప్రసారమైనవి. బాలయ్య టాక్ షో ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారమవుతూ ఉండడం విశేషం!