నజ్రియా నజీమ్.. రాజా రాణి డబ్బింగ్ సినిమాతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సాధించింది. ఆ సమయంలోనే ఈమె తెలుగులో అడుగుపెట్టొచ్చని అంతా అనుకున్నారు కానీ, అలా జరగలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ‘అంటే సుందరానికీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నజ్రియా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు తన మనసులోని మాటల్ని పంచుకుంది. ముఖ్యంగా.. తాను ఏయే తెలుగు హీరోలతో కలిసి పని చేయాలనుందో ఈ సందర్భంగా వెల్లడించింది.
రీసెంట్ ఇంటర్వ్యూలో భాగంగా తెలుగులో ఇతర సినిమాలేమైనా ఒప్పుకున్నారా? అనే ప్రశ్న ఎదురవ్వగా, ఇంకా లేదని నజ్రియా స్పష్టం చేసింది. అయితే, తెలుగులో ఆఫర్స్ వస్తే మాత్రం వెంటనే చేయాలనుకుంటున్నానని పేర్కొంది. మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేయాలనుందని తన కోరిక వెలిబుచ్చింది. మరి, ఈమె కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. ఇక ‘అంటే సుందరానికీ’లోని తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘‘లీలా చాలా పరిణతి ఉన్న అమ్మాయి, చాలా స్ట్రాంగ్, కానీ పైకి మాత్రం చాలా అమాయకురాలిలా కనిపిస్తుంది. ఇలా ఈ పాత్రలో చాలా కోణాలు ఉండడంతో నాకు సవాల్‌గా అనిపించి సినిమా ఒప్పుకున్నా. ఈ సినిమాలో నానితో కలిసి డ్యాన్స్ చేయడానికి బాగా కష్టపడాల్సి వచ్చింది’’ అని నజ్రియా చెప్పుకొచ్చింది.
సాధారణంగా పెళ్లైన తర్వాత కథానాయికలు సినిమాలకు స్వస్తి పలుకుతారు. కానీ, నజ్రియా మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఈ విషయంలో తన భర్త ఫహాద్ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ అమ్మడు వెల్లడించింది. స్క్రిప్ట్ విషయంలోనూ తన భర్త పెద్దగా జోక్యం చేసుకోడని, స్క్రిప్ట్ ఎంపికలో తుది నిర్ణయం ఎవరిది వారిదేనని తెలిపింది. రాజా రాణితో క్రేజ్ వచ్చినా, అప్పుడు టాలీవుడ్ అరంగేట్రానికి సరైన కథ దొరకలేదని.. అంటే సుందరానికీ స్క్రిప్ట్ నచ్చి వెంటనే ఓకే చేశానని.. ఇందులో ఫన్, ఎమోషన్, కమర్షియల్ అంశాలు అన్నీ ఉన్నాయని.. ఇలా అన్ని అంశాలు పక్కాగా కుదిరిన స్క్రిప్ట్ దొరకడం చాలా అరుదు అని నజ్రియా నజీమ్ వెల్లడించింది.