చాలా సంవత్సరాల తర్వాత మిల్కీ బ్యూటీ తాప్సీ పన్ను “మిషన్ ఇంపాజిబుల్” అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించనుంది. సరదాగా సాగే ఈ థ్రిల్లర్‌ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రబృందం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని మార్చి 30న నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే వేదిక, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్న ముఖ్య అతిథి వంటి ఇతర వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ తాజాగా సినిమాలోని మరో ఆసక్తికర అప్డేట్ ను రివీల్ చేశారు.
Read Also : Mukhachitram : అతిథిగా విశ్వక్ సేన్… సర్ప్రైజ్ లుక్ రివీల్
దర్శకుడు స్వరూప్ తన మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ హీరో నవీన్ పోలిశెట్టితో ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇప్పిస్తుండడం విశేషం. నవీన్ తన వాయిస్ ను సినిమాకు అరువిచ్చి కథనాన్ని మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నాడు. త్వరగా డబ్బు సంపాదించడం కోసం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునే పనిలో ఉన్న ముగ్గురు అమాయక పిల్లల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ‘ అదేనండీ నవీన్ పోలిశెట్టి సినిమాలో భాగం అవుతున్నాడని ప్రకటించడం హైప్ ని క్రియేట్ చేసింది. మరి నవీన్ వాయిస్ సినిమా హిట్ కావడానికి ఏ మేరకు సాయం చేస్తుందో చూడాలి.