టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలాంటి వివాదాలకు తావులేకుండా, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తూ ఆలోచనల్లో పడేస్తున్నాడు. తాజాగా ఆయన ‘హెల్త్ కేర్ సిస్టమ్’ గూర్చి తెలియజేస్తూ.. పూరీ మ్యూజింగ్స్ ద్వారా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్‌కు తగ్గట్టు మాట్లాడారు.
‘మనందరం రాత్రి, పగలు కష్టపడి ఆస్తులు కూడబెట్టేది పిల్లల చదువుల కోసం.. అనారోగ్య సమస్యలకి, సొంత ఇంటికి, వృద్ధాప్యం కోసం దాచుకుంటాం. కాకపోతే వీటన్నింటికీ ఎంత డబ్బు కావాలో, ఎంత దాచిపెట్టుకోవాలో మనకు తెలియదు.అయితే యూరప్, కెనడా, ఆస్ట్రేలియా తదితర కామన్‌వెల్త్ దేశాల్లో సిస్టమ్ చాలా బాగుంటుంది. పిల్లలందరికీ బేసిక్ ఎడ్యుకేషన్ ఉచితంగా అందిస్తారు. ఒకవేళ పై చదువులు చదవాలంటే ప్రభుత్వం నుంచి లోన్ తీసుకుని, ఉద్యోగం వచ్చాక మెల్లగా తీర్చొచ్చు. ఇక స్కాట్ ల్యాండ్‌లో అయితే ఎంత చదివినా, ఎన్నేళ్లు చదివినా అది పూర్తిగా ఉచితమే..
ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఆరోగ్య బీమా విషయానికొస్తే.. ఆయా దేశాల్లో నేషనల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇది ప్రపంచలోనే నంబర్ వన్‌గా వుంది. అక్కడ ప్రతి సిటిజన్‌కి ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఉంటాడు, అతడికి తన కింద ఉన్న రోగుల గురించి అంతా తెలుస్తుంది. ఇతర దేశాల్లో ఆరోగ్య సమస్యలతో జీవితాంతం బెడ్ మీదే ఉంటే ఆ రోగికి నెలకు రూ.3 లక్షల వరకు ఇస్తారు. చివరి వరకు చూసుకుంటారు, దాన్ని రెసిడెన్షియల్ కేర్ అంటారు. ఒక సిటిజన్ హెల్త్ కేర్ కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లైనా ఖర్చుపెడుతుంది. ఈ దేశాల్లో పుట్టినా అక్కడి సిటిజన్ షిప్ ఉన్నా పిల్లలు, ఆరోగ్యం గురించి ఆందోళన ఉండదు. భవిష్యత్ మీద భయంతో రకరకాల తప్పులు చేస్తూ డబ్బు సంపాదించే అవసరం కూడా ఉండదు. మనశ్శాంతిగా బతకొచ్చు. అలాంటి హెల్త్ కేర్ సిస్టమ్ మన ఇండియాలో కూడా రావాలని కోరుకుందాం’ అంటూ పూరీ వివరించారు.