మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డును ఇద్దరికేసి ప్రదానం చేస్తున్నారు. అంతకు ముందు కూడా ఈ అవార్డును కొన్ని సార్లు ఇద్దరికి ఇచ్చారు. కానీ, 2018, 2019, 2020 సంవత్సరాలకు గాను వరుసగా ఉత్తమ నటుడు కేటగిరీలో ఇద్దరికేసి అవార్డులు ఇస్తూ ఉండడం గమనార్హం! 2018 సంవత్సరానికి గాను ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ‘అంధాదున్’ సినిమా ద్వారా ఆయుష్మాన్ ఖురానా, ‘యురి: ద సర్జికల్ స్ట్రైక్’ చిత్రం ద్వారా విక్కీ కౌశల్ అవార్డును షేర్ చేసుకున్నారు.
కాగా, 2019లో ప్రదానం చేసిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఇదే ఉత్తమ నటుడు విభాగంలో హిందీ చిత్రం ‘భోంస్లే’ ద్వారా మనోజ్ బాజ్ పాయ్, తమిళ సినిమా ‘అసురన్’తో ధనుష్ పురస్కారాన్ని పంచుకోవలసి వచ్చింది. 67వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడు అవార్డును ఉత్తరాదిలో ఒకరికి, దక్షిణాదిన మరొకరికి పంచడం జరిగింది. అదే పంథాలో 2020కి గాను ప్రకటించిన 68వ నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ లోనూ బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఉత్తరాదికి చెందిన అజయ్ దేవగణ్ తన ‘తానాజీ’ చిత్రం ద్వారా, దక్షిణాదికి చెందిన సూర్య ‘సురారై పొట్రు’ తోనూ ఎంపికయ్యారు. ఉత్తర, దక్షిణ భేదం చూపడం లేదంటూ కేంద్రం ఈ పంథాను భవిష్యత్ లోనూ అనుసరిస్తుందేమో చూడాలి!