National Film Awards
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించిన ప్రతిసారీ మన తెలుగు వాళ్ళకు గతంలో రాని కేటగిరిల్లో ఈసారి అయినా అవార్డులు వస్తాయేమోనని మనవాళ్ళు ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ చాలా వరకూ ఈ విషయంలో నిరాశే మిగులుతోంది. వివిధ శాఖలలో మన వాళ్ళకు అడపా దడపా అవార్డులు వస్తూనే ఉన్నాయి కానీ అత్యంత ప్రధానమైన ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరిల్లో ఇంతవరకూ మనోళ్ళు బోణీ కొట్టకపోవడం దారుణం. ఎందుకంటే… ఎన్టీయార్, ఎయన్నార్ మొదలుకొని ఎంతోమంది ప్రతిభావంతులైన నటులు మనకున్నారు. వీరెవరికీ ఉత్తమ నటుడు కేటగిరిలో అవార్డే రాలేదు. తెలుగులో అత్యద్భుతమైన చిత్రాలను రూపొందించిన దర్శకులూ ఉన్నారు. వీరెవరికీ జాతీయ స్థాయిలో అవార్డ్ దక్కలేదు. 1954 నుండి జాతీయ సినిమా అవార్డులను అందిస్తున్నారు. అయితే 1967 నుండి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరిలలో అవార్డులను ఇస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ రెండు కేటగిరిల్లో మనవాళ్ళు సాధించింది సున్నా!
ఉత్తమ నటుడి కేటగిరి విషయానికి వస్తే… బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు నేషనల్ అవార్డ్ చాలా ఆలస్యంగా వచ్చింది. 1971లో విడుదలైన ‘ఆనంద్’తో చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న అమితాబ్ కు 1990లో కానీ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డ్ దక్కలేదు. 1990లో ‘అగ్నిపథ్’ సినిమాకి గానూ తొలిసారి ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న అమితాబ్ ఆ తర్వాత 2005లో ‘బ్లాక్’, 2009లో ‘పా’, 2015లో ‘పీకు’ చిత్రాలకు తిరిగి పొందారు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఈ అవార్డ్ అందుకుని ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత కమల్ హాసన్, మమ్ముట్టి, అజయ్ దేవ్ గన్ మూడేసిసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డులను అందుకున్నారు. మోహన్ లాల్, సంజీవ్ కుమార్, ఓంపురి, నజీరుద్దీన్ షా, మిధున్ చక్రవర్తి, ధనుష్ లకు రెండేసి సార్లు ఉత్తమ నటుడు పురస్కారాలు లభించాయి. ఇక 19 సంవత్సరాలకే ‘నగర్ కీర్తన్’ అనే బెంగాలీ మూవీతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని రిద్దీసేన్ చరిత్ర సృష్టించాడు.
బాలకృష్ణ – అల్లు అర్జున్… వీరిలో ఎవరికో!
ఇదిలా ఉంటే… శుక్రవారం 2020 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రభుత్వం ప్రకటించింది. మన వాళ్లు ఎదురుచూసినట్టు ఈ సారి కూడా ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరిల్లో అవార్డులు మనకు రాలేదు. దాంతో ఇప్పుడు అందరి చూపు 2021లో విడుదలైన సినిమాల మీద పడింది. ఒకవేళ ఆ అవార్డ్ కు తెలుగు హీరోలు అర్హులైతే…. ఎవరికి ఇది దక్కే ఛాన్స్ ఉందనే చర్చ కూడా ఇప్పటి నుండే ఫిల్మ్ నగర్ లో మొదలైంది. 2021లో విడుదలైన సినిమాలలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, అల్లు అర్జున్ ‘పుష్ప’ ఉన్నాయి. మిగిలిన కేటగిరీలా సంగతి ఎలా ఉన్నా… ‘అఖండ’లో బాలకృష్ణను, ‘పుష్ప’లో అల్లు అర్జున్ ను ఉత్తమ నటుడు కేటగిరికి పరిగణించవచ్చన్నది అందరూ చెబుతున్న మాట. ‘అఖండ’ సినిమా ఊహించని రీతిలో పేరుకు తగ్గట్టుగానే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ లోని నటుడిని మరోసారి అత్యద్భుతంగా బోయపాటి శ్రీను తెర మీద ప్రజెంట్ చేశాడు. అఘోరగా బాలకృష్ణ నటన అనితర సాధ్యమని ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పిన మాట. ఇక అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం తొలుత ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే పాన్ ఇండియా మూవీగా హిందీలోనూ విడుదలైన ఉత్తరాది ప్రేక్షకుల మన్ననలు పొందింది. దాంతో అల్లు అర్జున్ కు అక్కడా మంచి గుర్తింపు లభించింది. ‘పుష్ప’ మూవీలో వైవిధ్యమైన పాత్రను పోషించిన అర్జున్ సైతం నేషనల్ అవార్డ్ కు అర్హుడే అని కొందరు అంటున్నారు. ఏదేమైనా… మనవాళ్ళకు 2021 ఉత్తమ నటుడు కేటగిరిలో అవార్డు వస్తే మాత్రం… అభిమానులకు పండగే పండగ! ఎందుకంటే తెలుగులో ఈ కేటగిరిలో వచ్చే తొలి అవార్డే ఇదే అవుతుంది!!
ఉత్తమ దర్శకుడు ఎవరు!?
ఉత్తమ నటుడు కేటగిరితో పాటే 1967లోనే ఉత్తమ దర్శకుడు అవార్డునూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ యేడాది తొలి అవార్డును ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే అందుకున్నారు. విశేషం ఏమంటే… ఇంతవరకూ ఈ కేటగిరిలో అత్యధిక అవార్డులు అందుకున్న దర్శకుడు కూడా ఆయనే! సత్యజిత్ రేకు మొత్తం ఆరు అవార్డులు ఈ కేటగిరిలో వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో ఐదు అవార్డులతో ఆదూర్ గోపాలకృష్ణన్ నిలువగా, మృణాల్ సేన్ బెస్ట్ డైరెక్టర్ గా నాలుగు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఇంతవరకూ పదహారుసార్లు బెంగాలీలు, పదమూడుసార్లు మలయాళీలు, పదకొండు సార్లు హిందీ దర్శకులు, నాలుగు సార్లు తమిళ దర్శకులు, మూడుసార్లు ఇంగ్లీష్, కన్నడ దర్శకులు ఈ అవార్డులను పొందారు. గడిచిన 54 సంవత్సరాలలో రాని ఉత్తమ దర్శకుడి అవార్డు మనవాళ్ళకు 2021లో అయినా వస్తుందేమో చూడాలి. ఎందుకంటే మన దర్శకులు సైతం పాన్ ఇండియా చిత్రాలను తీసి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అలరింప చేస్తున్నారు.