నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం “అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. అయితే తాజాగా “అంటే సుందరానికి” మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. టీజర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో “ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయి. మీరెప్పుడు పాన్ ఇండియా స్టార్ అవుతున్నారు ?” అనే ప్రశ్న నానికి ఎదురైంది. ఈ ప్రశ్నకు స్పందించిన నాని ‘పాన్ ఇండియా అంటే ఏంటో తెలీదు’ అంటూ సమాధానం చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Ante Sundaraniki : కన్నడలో నో రిలీజ్… రీజన్ ఇదేనట !!
నాని మాట్లాడుతూ “ముందుగా పాన్ ఇండియా అంటే ఏంటో నాకు తెలియదు. మన సినిమాకు దేశమంతా మంచి పేరు వస్తే, ఎక్కడెక్కడి నుంచో మన సినిమాను చూసి చాలా బాగుందని ఫోన్ చేసినా సరే అది పాన్ ఇండియా సినిమానే. ఇప్పుడు ‘దసరా’ అన్ని భాషల్లో ఉంది. కానీ ఇండియాలో ప్రతి ప్లేస్ లో, ప్రతి కార్నర్ లో విడుదలైతే తప్ప పాన్ ఇండియా సినిమా కాదని నా ఫీలింగ్. మనం అన్ని సినిమాలకు కూడా పాన్ ఇండియా అని అటాచ్ చేయడం వల్ల కూడా లాభం లేదు. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా అదేదో తెలుగు సినిమా బాగుందంటరా అని విని, దాన్ని ఎక్కడో ఒకచోట వెతుక్కుని, ఓటిటిలో అయినా సరే చూసే సినిమాలు చేద్దాం. అదే నిజమైన పాన్ ఇండియా ఫిలిమ్స్” అంటూ చెప్పుకొచ్చారు. ఇక “అంటే సుందరానికి” మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.