ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… కోటి సైతం ఇటీవల కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించడం మొదలు పెట్టారు. తాజాగా రాజీవ్ సాలూరి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలోనూ కోటి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేశ్ (బళ్ళారి) నిర్మిస్తున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఇటీవల వైజాగ్ లో మొదలైంది. సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజాశ్రీ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వీరేశ్ మాట్లాడుతూ, ”మా ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న తొలి చిత్రం ఇది. కాంప్రమైజ్ కాకుండా మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. తొలి షెడ్యూల్ సంతృప్తికరంగా పూర్తయ్యింది. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టాం. కోటి గారి తనయుడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ గారు సంగీతం అందించడం, అలానే కోటిగారు ప్రధాన పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. రాజీవ్, వర్ష మధ్య కెమిస్ట్రీ మూవీకి హైలైట్ గా నిలుస్తుంది” అని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, తనను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత వీరేష్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని దర్శకుడు కిట్టు నల్లూరి చెప్పారు. ఈ చిత్రానికి విష్ణు సూర్య గుంత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా పవన్ కె అచల మాటలందిస్తున్నారు.
