నొప్పింపక తానొవ్వక సాగే… మురళీ మోహన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జగమే మాయ’ అంటూ చిత్రసీమలో ప్రవేశించిన మురళీ మోహన్ ఈ మాయా జగతిలోనూ అందరివాడు అనిపించుకున్నారు. నొప్పించక తానొవ్వక అన్నట్టుగా మురళీమోహన్ తీరు ఉంటుంది. అందరినీ నవ్వుతూ పలకరించడం, చిత్రసీమలో తనను ఆశ్రయించిన వారికి తగిన సాయం చేయడం, సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించడం, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనదైన బాణీ పలికించడం, ‘జయభేరీ’ అధినేతగా మరపురాని చిత్రాలను అందించడం, రియల్ ఎస్టేట్ లోనూ జయభేరీ మోగించడం, తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించడం- ఇలా పలు విధాలా సాగిన మురళీ మోహన్ ఈ జూన్ 24తో 82 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఎంతో చురుగ్గా ఉంటూ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికీ సిద్ధంగా ఉన్నారు. ఇక చదువుకోవాలనుకొనే నిరుపేదలకు చేయూతను అందిస్తూ ఉన్నారాయన.
మురళీ మోహన్ అసలు పేరు మాగంటి రాజాబాబు. 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో ఆయన జన్మించారు. తన కుటుంబ వ్యాపారం చూసుకుంటూ మదరాసుకు తరచూ వెళ్ళేవారు. ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ ‘మన’సత్యం దగ్గరకు ఓ మిత్రుణ్ణి ఫోటో తీయించడానికి తీసుకు వెళ్ళారు. ఆ సమయంలో ‘నువ్వే హీరోలా ఉన్నావ్, సినిమాల్లో ట్రై చేయరాదూ’ అంటూ సత్యం సలహా ఇచ్చారు. దాంతో మురళీమోహన్ కూడా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పటికే ఆయన మిత్రులు కొందరు చిత్రసీమలో ఉండడంతో మురళీమోహన్ కూడా ఉత్సాహంగా సినిమా రంగంవైపు పరుగులు తీశారు. 1973లో ‘జగమే మాయ’ చిత్రంలో తొలిసారి నటించిన మురళీమోహన్ ఆ తరువాత హీరో వేషాలే వేస్తానని మడి కట్టుకు కూర్చోలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతీపాత్రకు న్యాయం చేస్తూ పోయారు. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, ఛటర్జీ, విజయబాపినీడు వంటివారు మురళీమోహన్ ను భలేగా ప్రోత్సహించారు. కొన్నిసార్లు హీరోని చేశారు, మరికొన్ని సార్లు కేరెక్టర్ యాక్టర్ గానూ చూపారు.
మురళీమోహన్ నటజీవితంలో 1978వ సంవత్సరం మరపురానిది. ఆ సమయంలో యన్టీఆర్ ఓ వైపు పదికి పైగా చిత్రాల్లో నటించారు. మరోవైపు ఏయన్నార్ కూడా ఐదు సినిమాలు చూపారు. ఇక కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్ – ఇలా అందరూ వరుస సినిమాలు విడుదల చేశారు. అయినా ఆ సంవత్సరం మురళీమోహన్ హీరోగా రూపొందిన ‘పొట్టేలు పున్నమ్మ’ అనూహ్య విజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందువల్ల ఆ సంవత్సరం మురళీమోహన్ కు మరపురానిది అని చెప్పవచ్చు.
Also Read
మురళీమోహన్ హీరోగా నటించిన అనేక చిత్రాలు విజయం సాధించాయి. అయినా సైడ్ హీరో రోల్స్ ను మాత్రం వీడలేదు. గిరిబాబు ‘జయభేరి’ సంస్థ నెలకొల్పి తెరకెక్కించిన చిత్రాల్లో మురళీమోహన్ కీలక పాత్రలు పోషించారు. తరువాత అదే బ్యానర్ ను మురళీమోహన్ సొంతం చేసుకొని అనేక మరపురాని చిత్రాలను నిర్మించారు. కొన్నిట తానే హీరోగా నటించారు. మరికొన్నిటిలో ఇతరులను హీరోలుగా పెట్టి సినిమాలు తెరకెక్కించారు. ఆయన నూరవ చిత్రంగా రూపొందిన ‘పిచ్చి పంతులు’ కూడా జయభేరీ చిత్రమే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సమయంలో యన్టీఆర్ రాజకీయప్రవేశం చేశారు. అందులో “రామయ్యా రావయ్యా…” అంటూ రూపొందించిన పాట ఆ రోజుల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మురళీమోహన్ హైదరాబాద్ మకాం మార్చారు. ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు రియల్ ఎస్టేట్ లో కాలు మోపారు. ‘భూమిని నమ్ముకుంటే అది మనల్ని కాపాడుతుంది’ అన్న శోభన్ బాబు సూత్రాన్ని అనుసరిస్తూ మురళీమోహన్ తాను రియల్ ఎస్టేట్ లో అడుగు పెట్టానని చెబుతారు. నిజంగానే రియల్ ఎస్టేట్ లో ఆయన ‘జయభేరీ’ మోగించారు. ఇక తమ జయభేరీ పతాకంపై ఆయన నిర్మించిన చివరి చిత్రం ‘అతడు’. ఆ సినిమా అప్పట్లో ఆయనకు ఆట్టే లాభాలు సంపాదించి పెట్టలేకపోయింది. అయితే, విచిత్రంగా బుల్లితెరపై ‘అతడు’ విశేషంగా అలరించింది. ఆ సినిమా తెచ్చిన నష్టాన్ని శాటిలైట్ ద్వారానే పూడ్చేసింది.
చిత్రనిర్మాణానికి దూరంగా ఉన్న మురళీమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరి, 2009లో రాజమండ్రి లోక్ సభకు పోటీ చేసి, పరాజయాన్ని చవిచూశారు. 2014లో అదే నియోజక వర్గం నుండి టీడీపీ టిక్కెట్టు పైనే గెలుపు సాధించారు. తరువాత రాజకీయాలకు దూరంగా జరిగారు. ఎనభై ఏళ్ళు పైబడినా, ఇప్పటికీ ఉరకలు వేసే ఉత్సాహంతో ఉన్న మురళీమోహన్ ను చూస్తే, ఆయన వయసులో సగం ఉన్నవారికి కూడా స్ఫూర్తి కలుగుతుంది. ‘నవ్వేందుకే ఈ జీవితం…నవ్వొక్కటేరా శాశ్వతం…’ అన్నది మురళీమోహన్ ఫిలాసఫీ. ఎలాంటి సమస్య ఎదురైనా నవ్వుతూనే ఎదుర్కోవడమూ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందరివాడుగా నిలచిన మురళీమోహన్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!