Mrunal Thakur Speech At Sitaramam Pre Release Event: తనకు సీత లాంటి పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని, ఇలాంటి పాత్రను తాను దశాబ్దాల నుంచి చూడలేదని నటి మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పింది. తనకు ఈ పాత్రలో నటించే ఆఫర్ ఇచ్చిన దర్శకుడు హనురాఘవపూడికి థ్యాంక్స్ అని, తాను ఈ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశానని భావిస్తున్నానని తెలిపింది. టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలు చూస్తున్న ప్రతీసారి తాను ఓ ప్రత్యేక అనుభూతిని చెందుతున్నానని.. అంత ప్రభావం ఈ పాత్రలో ఉందని మృణాల్ పేర్కొంది. నిర్మాత స్వప్న దత్ ఊహించినట్టు, ఈ సీత పాత్రను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారని వెల్లడించింది.
కథ విన్నప్పుడే తాను ‘రామ్’ పాత్రతో ప్రేమలో పడిపోయానని, ఆ సమయంలో తనకు ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయం తెలియదని, ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడని తెలిసి చాలా సంతోషించానని మృణాల్ తెలిపింది. అతడు కూడా ఈ పాత్రలో చాలా అద్భుతంగా నటించాడని, అతడు తప్ప ఈ పాత్రకు ఎవ్వరూ న్యాయం చేయలేరని కొనియాడింది. తనకు ఇలాంటి సినిమాతో డెబ్యూ ఇస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానంది. ఇక చివర్లో.. చేతులెత్తి నమస్కరిస్తూ, ఇది తన తెలుగు సినిమా అని, తనని ప్రోత్సాహించాలని వేడుకుంది. థియేటర్లలోనే ఈ సినిమాని చూడాలని రిక్వెస్ట్ చేసింది. ఇప్పటివరకూ ఎన్నో కథలు, ప్రేమకథలు వచ్చాయని.. కానీ ‘సీతారామం’ వాటన్నింటికీ భిన్నంగా ఉంటుందని చెప్పింది. సినిమా చూస్తున్నంతసేపు ‘సీతారామం’తో పాటు మీరు ప్రయాణం చేస్తారని, ప్రతీ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తారని పేర్కొంది.