మోహన్ లాల్ – ఈ పేరు మళయాళ సీమలో ఓ సమ్మోహనం! ముద్దుగా బొద్దుగా ఉంటూనే పాత్రకు పరిమితమైన అభినయాన్ని ప్రదర్శిస్తూ మోహన్ లాల్ సాగుతున్నారు. కేరళ వాసులు కేరింతలు కొడుతూ మోహన్ లాల్ చిత్రాలను ఆదరిస్తున్నారు. వారిని అలరించేందుకు తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నారు మోహన్ లాల్. కొన్ని తెలుగు చిత్రాలలోనూ నటించి ఆకట్టుకున్నారాయన. మాతృభాష మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలోనూ మోహన్ లాల్ నటించి మురిపించారు.
మోహన్ లాల్ 1960 మే 21న కేరళలోని ఎలంతూర్ లో జన్మించారు. తిరువనంతపూర్ లోని మహాత్మగాంధీ కాలేజ్ లో బి.కామ్, చదివారు. హైస్కూల్ లో చదివే రోజుల నుంచీ మోహన్ లాల్ నాటకాల్లో నటిస్తూ వచ్చారు. దాంతో తొలినుంచీ నటనపై ఆయనకు ఆసక్తి ఉందనే చెప్పాలీ. 18 ఏళ్ళ ప్రాయంలోనే మోహన్ లాల్ మిత్రులతో కలసి ‘తిరనోత్తమ్’ అనే చిత్రం నిర్మించారు. అందులో ఓ చిన్న పాత్రలో కనిపించారు. తరువాత డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా, ‘మంజిల్ విరింజ పూక్కల్’ అనే సినిమాతో నటనను సీరియస్ గా తీసుకున్నారు. చదువు పూర్తి కాగానే ఆయన దృష్టి నటనపై తప్ప మరే దానిపైనా కేంద్రీకృతం కాలేదు. వరుసగా లభించిన ప్రతి పాత్రనూ చేస్తూ పోయారు. 1983లో ఏకంగా 25 చిత్రాలలో చిన్నాచితకా వేషాలు వేశారు. ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే ధరించారు. పలువురు పేరున్న దర్శకుల చిత్రాలలో నటించడం మూలంగా మోహన్ లాల్ కు నటునిగా మంచి గుర్తింపు లభించింది. ఇక ‘టి.పి.బాలగోపాలన్ ఎమ్.ఏ.’ సినిమాతో మోహన్ లాల్ కు హీరోగానూ మంచి గుర్తింపు లభించింది. అప్పటి నుంచీ హీరో వేషాలే వేస్తూ ముందుకు సాగారు.
ఇప్పటికి దాదాపు నాలుగు వందల పైచిలుకు చిత్రాలలో మోహన్ లాల్ నటించారు. వాటిలో ఓ 150కి పైగా చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలే పోషించారు. మళయాళ చిత్రసీమలో ఓ నాటి సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్, ఆయన తరువాత స్టార్ గా సాగిన మమ్ముట్టి కూడా అదే తీరున నటించిన వారే. ఆ స్ఫూర్తితోనే మోహన్ లాల్ సైతం దొరికిన ప్రతి పాత్రలోనూ తనదైన అభినయం ప్రదర్శిస్తూ సాగారు. ఆయన హీరోగా నటించిన అనేక చిత్రాలు కేరళ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. తరువాత మళయాళ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు. అక్కడ మాస్ మసాలా చిత్రాలతోనూ మురిపించిన ఘనత సాధించారు. అయినప్పటికీ వైవిధ్యం అనిపిస్తే చాలు వేరే మాట లేకుండా నటించేస్తూ ఉంటారు మోహన్ లాల్. 1991లో ‘భారతం’ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు మోహన్ లాల్. తరువాత 1999లో తాను నిర్మించి, నటించిన ‘వానప్రస్థం’ ద్వారా కూడా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక బెస్ట్ ప్రొడ్యూసర్ గానూ ‘వానప్రస్థం’తో నేషనల్ అవార్డు అందుకున్న మోహన్ లాల్, కొన్ని సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డులనూ సొంతం చేసుకున్నారు. తెలుగులో ఆయన నటించిన ‘జనతా గ్యారేజ్’ ద్వారా జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఎనిమిది సార్లు ఉత్తమ నటునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. కేరళ ప్రభుత్వ అవార్డులూ ఆయన చెంత చేరి వెలిగాయి. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాదమై అలరించాయి. ఈ మధ్య కాలంలో మోహన్ లాల్ ‘మన్నెం పులి’ తెలుగువారిని విశేషంగా అలరించింది. బాలకృష్ణ ‘గాండీవం’ చిత్రంలో ఏయన్నార్ పై చిత్రీకరించిన ‘గోరువంక వాలగానే..’ పాటలో మోహన్ లాల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇదే ఆయన కనిపించిన తొలి తెలుగు చిత్రం! ‘జనతా గ్యారేజ్’ సమయంలోనే మోహన్ లాల్ సోలోగా నటించిన ‘మనమంతా’ అనే తెలుగు చిత్రం కూడా వెలుగు చూసింది.
తమిళ దర్శకుడు కె.బాలాజీ కూతురు సుచిత్రను మోహన్ లాల్ పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిలో ప్రణవ్ మోహన్ లాల్ తండ్రి బాటలోనే పయనిస్తూ నటునిగా మారాడు. మోహన్ లాల్ నిర్మాతగానే కాకుండా, కొన్ని చిత్రాలలో గాయకునిగానూ మురిపించారు. తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగుతున్న మోహన్ లాల్ రాబోయే చిత్రాలతో మరెంతగా అలరిస్తారో చూడాలి. ఇక తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా షాజీ కైలాష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఎలోన్’ టీజర్ విడుదల చేశారు.