ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో డెబ్యూ హిట్ అందుకున్న దర్శకుడు స్వరూప్. ఈ సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్. యంగ్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముగ్గురు చిన్న పిల్లలు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక పొలిటికల్ క్రిమినల్ ని పట్టుకొనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా తాప్సీ కనిపించింది. దానికోసం ముగ్గురు చిన్నపిల్లల సహాయం తీసుకుంటుంది.
రఘుపతి రాఘవ రాజారామ్ అనే ముగ్గురు స్నేహితులు ముంబై డాన్ దావుద్ ఇబ్రహీం ని పట్టిస్తే లక్షల్లో డబ్బు వస్తుందని, ఎలాగైనా అతడిని పట్టుకోవాలని చెప్పి ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్తారు. తాప్సీ కూడా వారి ధైర్యాన్ని మెచ్చుకుంటోంది. అయితే వాళ్ళు ఈ మిషన్ ను ఎలా పూర్తి చేస్తారు.. చివరికి వారు ఆ డబ్బును పొందారా..? లేదా అనేది కథలో కీలకాంశం. ఒక సీరియస్ విషయాన్ని స్వరూప్ కామెడీగా, సెటైరికల్ గా చూపించినట్లు తెలుస్తుంది. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ స్టైల్లో కామెడీ కూడా ఉంటుందని అర్ధం అవుతుంది. తాప్సీతో పాటుగా ముగ్గురు పిల్లలు తమ ఉల్లాసమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2022 ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో స్వరూప్ తన హిట్ ట్రాక్ ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.