Megha Akash: చెన్నయ్ చిన్నది మేఘా ఆకాశ్ ఐదేళ్ళ క్రితం ‘లై’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే నితిన్ సరసనే ‘ఛల్ మోహన్ రంగా’ మూవీలోనూ నటించింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్దంత సక్సెస్ కాకపోయినా… మేఘా ఆకాశ్ మాత్రం దర్శక నిర్మాతల దృష్టిలో బాగానే పడింది. ఆ వెంటనే తెలుగుతో పాటు పలు తమిళ, హిందీ సినిమాలలోనూ అమ్మడికి అవకాశాలు లభించాయి. అందం, అభినయం కలిగలిసిన ఈ తార చేతిలో ఇప్పుడు ఆరేడు సినిమాలు ఉన్నాయి. ఇందులో కొన్ని చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యాయి. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ రూపొందించిన ఓటీటీ మూవీ ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’లో రకుల్ ప్రీత్ సింగ్, నివేతా పేతిరాజ్, మంజిమా మోహన్ తో పాటు మేఘా ఆకాశ్ కూడా కీలక పాత్ర పోషించింది. అలానే సత్యదేవ్, తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ మూవీలోనూ మేఘా నటించింది.
మాస్ మహరాజా రవితేజ తో సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న యునిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’లో మేఘా ఆకాశ్ కీ-రోల్ ప్లే చేసింది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ కందుకూరి హీరోగా భరత్ పెదగాని రూపొందిస్తున్న ‘మనుచరిత్ర’లో మేఘా ఆకాశ్ నాయికగా నటిస్తోంది. ఇందులో ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కూడా హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఇక రాహుల్ విజయ్, మేఘా ఆకాశ్ జంటగా ‘మాటే మంత్రం’ మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు మేఘా ఆకాశ్ తల్లి బిందు ఆకాశ్ సమర్పకురాలు కావడం విశేషం. దీన్ని అభిమన్యు బద్ధి దర్శకత్వంలో ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఇక త్రిగుణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘ప్రేమదేశం’ చిత్రంలో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. మణిశర్మ స్వరరచన చేస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ రకంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కుతున్న పలు సినిమాలలో మేఘా ఆకాశ్ నటిస్తోంది. అక్టోబర్ 26న ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొంతమంది దర్శక నిర్మాతలు విషెస్ తెలియచేస్తూ, స్పెషల్ పోస్టర్స్ ను విడుదల చేశారు.