Megastar Chiranjeevi Godfather Teaser Released: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ టీజర్, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు (ఆగస్టు 21) సాయంత్రం విడుదల అయ్యింది. 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్.. చివర్లో సల్మాన్ ఖాన్, చిరంజీవి ఒక గోడను బద్దలుకొట్టుకుంటూ కారులో వచ్చే సీక్వెన్స్‌తో ముగుస్తుంది. విజువల్స్ ఆద్యంతం అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. మధ్యలో నయనతార, సత్యదేవ్ తళుక్కున మెరిశారు. ఇక చిరంజీవి ఎంట్రీ అయితే అదుర్స్ అని చెప్పుకోవాలి.
చూస్తుంటే.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఫైట్స్‌ని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అనంతరం సల్మాన్ ఖాన్ హిందీలో ‘చూస్తుంటే, ఏదో పెద్ద ప్లానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది, నీ చిన్న తమ్ముడ్ని మరవకు సోదరా’ అంటూ ఇక స్టంట్ సీన్‌తో మెరుపు ఎంట్రీ ఇచ్చాడు. సల్మాన్, చిరు కాంబో వెండితెరపై మెరుపులు మెరిపించడం ఖాయంలా అనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందకు ‘గాడ్‌ఫాదర్’ను తీసుకురానున్నట్టు వెల్లడించారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.