Tollywood: గడిచిన మూడు నెలల్లో అత్యధికంగా సినిమాలు మార్చి నెలలోనే రిలీజ్ అయ్యాయి. జనవరిలో 15 సినిమాలు విడుదలైతే, ఫిబ్రవరిలో వాటి సంఖ్య 22. బట్.. ఈ మార్చిలో ఏకంగా 34 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎనిమిది అనువాద చిత్రాలు కాగా మిగిలినవన్నీ స్ట్రైట్ సినిమాలే. వీటిల్లో మార్చి 3న వచ్చిన ‘బలగం’ చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో నిర్మాత ‘దిల్’ రాజు కొద్ది రోజుల ముందే ప్రీమియర్ షోస్ వేయడం మూవీకి బాగా ప్లస్ అయ్యింది. మార్చి ఫస్ట్ వీకెండ్ లో ‘బలగం’తో పాటు మరో ఏడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అ్లలుడు’ కూడా ఉంది. కానీ ఏ సినిమా తనదైన మార్క్ ను బాక్సాఫీస్ లో క్రియేట్ చేయలేదు. కమెడియన్ వేణు ఫస్ట్ టైమ్ మెగాఫోన్ చేతపట్టి తీసిన ‘బలగం’ నేపథ్యం తెలంగాణా గ్రామీణ ప్రాంతమే అయినా… అందులోని ఫ్యామిలీ సెంటిమెంట్ కు అందరూ కనెక్ట్ అయ్యారు. మరో విశేషం ఏమంటే… ఈ సినిమా మూడు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అయినా… థియేటర్లలో చక్కని కలెక్షన్లలో ప్రదర్శితమౌతోంది.
మార్చి సెకండ్ వీకెండ్ లో ఆది సాయికుమార్ నటించిన ‘సి.ఎస్.ఐ. సనాతన్’తో పాటు మరో ఏడు సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా తన సత్తాను చాటలేకపోయింది. ఇదే వీకెండ్ లో సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తెరకెక్కించిన ‘దోచేవారెవరురా’ కూడా విడుదలైంది. కానీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. మూడో వారంలో నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ రూపొందించిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’తో పాటుగా మరో మూడు సినిమాలు వచ్చాయి. ఇవన్నీ ఇలా వచ్చి, అలా థియేటర్స్ నుండి వెళ్ళిపోయాయి. ఫోర్త్ వీకెండ్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీ విడుదలైంది. మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’కు ఇది రీమేక్. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే బ్రహ్మానందం పోషించిన చక్రపాణి పాత్రకు విశేష స్పందన లభించింది. ఈ సినిమా మీద నమ్మకంతో కృష్ణవంశీ కూడా విడుదలకు వారం ముందు నుండే ప్రీమియర్ షోస్ ను వేశారు. చూసిన వారంతా అద్భుతమని కితాబిచ్చినా, థియేటర్లలో ఈ మూవీకి పెద్దంత స్పందన లభించలేదు. ఇదే వారం వచ్చిన మరో సినిమా ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఇందులో డ్యుయల్ రోల్ ప్లే చేయడంతో పాటు డైరెక్షన్ చేశాడు. అతని తండ్రి కరాటే రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ‘దాస్ కా ధమ్కీ’ విడుదలైంది. బట్… నిరాశ పర్చింది. ఈ వారం ఈ రెండు సినిమాలతో పాటు మరో ఆరు చిత్రాలు వచ్చాయి. ఏవీ కూడా కమర్షియల్ సక్సెస్ ను సాధించలేదు.
ఈ నెల చివరి వారంలో నేచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీ విడుదలైంది. నానికి ఇది తొలి పాన్ ఇండియా మూవీ. ‘బలగం’ తరహాలోనే ఇది కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ చెరుకూరి సుధాకర్ ‘దసరా’ను భారీ స్థాయిలో నిర్మించారు. ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే కథాబలం లేకపోవడంతో కలెక్షన్లు ఏమేరకు స్టేబుల్ గా ఉంటాయనేది వేచి చూడాలి. ‘దసరా’తో పాటు ఈ వీకెండ్ లో మరో ఐదు సినిమాలు వచ్చాయి కానీ అవేవీ బాక్సాఫీస్ బరిలో చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపడం లేదు.