Manoj Bajpayee Clarity On Pushpa 2 Rumours: ‘పుష్ప: ద రైజ్’ సినిమా బాలీవుడ్‌లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో.. ‘పుష్ప-2’కి మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యాడు దర్శకుడు సుకుమార్. ఈసారి హిందీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకొని, కథలో చాలా మార్పులు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. అంతేకాదు.. కొందరు ప్రముఖ హిందీ నటుల్ని సైతం రంగంలోకి దింపుతున్నాడని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు మనోజ్ బాజ్పాయ్ పేరు తెరమీదకొచ్చింది. కీలకమైన పోలీస్ పాత్ర కోసం సుకుమారు ఆ నటుడ్ని సంప్రదించారని ప్రచారం ఊపందుకుంది.
ఆల్రెడీ ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే! అయితే.. ఆ పాత్రలో ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి. అందుకే, దానికి పూర్తి విరుద్ధంగా, అంటే పాజిటివ్ షేడ్స్ ఉన్న మరో పోలీస్ పాత్రని సుకుమార్ డిజైన్ చేశాడని, అందుకోసం మనోజ్‌ను రంగంలోకి దింపనున్నాడని పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీటిని చిత్రబృందం సహా ఆ నటుడు కూడా తోసిపుచ్చకపోవడంతో.. నిజంగానే మనోజ్ పుష్ప-2లో నటించనున్నాడేమోనని అంతా అనుకున్నారు. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని మనోజ్ తాజాగా తేల్చి చెప్పాడు. తాను పుష్ప-2లో నటించనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఖండించాడు.
‘‘ఇలాంటి వార్తల్ని మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తార్రా బాబు’’ అంటూ ట్వీట్ చేస్తూ.. వాటికి రెండు నవ్వుతున్న ఎమోజీల్ని జోడించాడు మనోజ్ బాజ్పాయ్. తాను పుష్ప-2లో నటించడం కాదు కదా, అసలు ఆ సినిమా యూనిట్ నుంచి తనని ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశాడు. మనోజ్ ఇదివరకే తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత అతనికి మరింత క్రేజ్ వచ్చింది. కాబట్టి, అతను పుష్ప-2లో ఉండి ఉంటే, కచ్ఛితంగా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ వచ్చేది.