ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె మాళవిక ఇప్పటికే మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు ఉత్తరాదిన తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఐదేళ్ల క్రితం ‘బియాండ్ ద క్లౌండ్స్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్ సినిమాల్లో కంటే కమర్షియల్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. అదే సమయంలో సినిమాల ఎంపికపై ఆచితూచి అమ్మడు అడుగులు వేస్తోంది.
తాజాగా సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ కభీ దివాలీ’ మూవీలో మాళవిక మోహనన్ నటించబోతోందనే వార్తలు బాలీవుడ్ లో గుప్పుమన్నాయి. సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా అన్నయ్యగా వెంకటేశ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆ విషయాన్ని ఇటీవల వెంకటేశ్ సైతం కన్ ఫర్మ్ చేశాడు. ఇందులో సల్మాన్ ఖాన్ సోదరులుగా జెస్సీ గిల్, సిదార్థ్ నిగమ్ నటించబోతున్నారని, అందులో జెస్సీకి జోడీగా ఇప్పటికే షెహనాజ్ ను తీసుకున్నారని, తాజాగా సిద్ధార్థ్ నిగమ్ సరసన మాళవిక మోహనన్ ను ఎంపిక చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంతమాత్రం నిజంలేదని, ఆ సినిమాలో తాను నటించడం లేదని మాళవిక వివరణ ఇచ్చింది. ఫర్హద్ సామ్జీ దర్శకత్వం వహించబోతున్న ‘కభీ ఈద్ కభీ దివాలీ’ మూవీ ఈ యేడాది డిసెంబర్ 30న విడుదల కానుంది.