సినీ నిర్మాత అల్లు అరవింద్ సినిమా పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే సినిమాల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది.కరోనా వైరస్ ఎఫక్ట్‌తో రెండేళ్ల పాటు.. జనం చాలావరకు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏకంగా ఇంటి నుంచే పని మొదలు పెట్టారు. దీంతో జనం ఇంటి నుండే వినోదం కోరుకోవడంతో OTT ఊపందుకుంది. అందరూ OTT వేదికగా వెబ్ సిరీస్ లు , సినిమాలు విడుదల చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు అదే సినీ పరిశ్రమకు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది, ప్రస్తుతం పరిస్థితి చక్కబడినా..జనం థియేటర్లకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త సినిమా విడుదలైనా థియేటర్లకు వచ్చేందుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. రెండు మూడు వారాల్లో OTT లోకి వచ్చేస్తుంది.. ఇంట్లోనే సినిమా చూసేద్దామన్న ఆలోచనలో పడ్డారు జనాలు . ఈక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.
సినిమాలు థియేటర్లలోనే చూడాలని సూచించారు నిర్మాత అల్లు అరవింద్. “టికెట్ రేట్లు తగ్గించాలి, OTT ని కాస్త దూరం పెట్టాలి” అంటూ సింపుల్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు అరవింద్. సినీ పరిశ్రమ ఇప్పుడు నేర్చుకున్న పాఠం ఏమిటంటే.. టికెట్ రేట్లు తగ్గించాలి, OTT లలో ఆలస్యంగా సినిమా వేయాలని తెలిపారు. ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్ కు రావడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు..సినిమా ప్రమోషన్స్ కోసం హిరోలు కూడా రావాలన్నారు. ఈ మధ్య స్టేజ్ మీద ఓ పెద్ద హిరో డాన్స్ కూడా చేశాడని అన్నారు. ఆడియన్స్ థియేటర్స్ కు రప్పించడానికి హీరో, హీరోయిన్స్ ప్రమోషన్ చేసుకోవాలని చెప్పారు నిర్మాత అల్లు అరవింద్. ఇక ఇటీవలే సర్కారు వారి పాట సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమం కర్నూలు లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేజ్ పై మహేష్ బాబు తొలిసారిగ డాన్స్ వేసి తన ఫ్యాన్స్ ను అలరించారు.
అయితే KGF, RRR వంటి బడా సినిమాలకు టికెట్ రేట్లు పెంచేశారు. అది నిర్మాతలకు వర్క్ అవుట్ అయ్యింది. కానీ అదే ప్లాన్ ఆచార్య విషయంలో బెడిసి కొట్టింది. దీంతో మొదటికే మోసం వచ్చిందని గ్రహించి టికెట్ రేట్లు మళ్లీ తగ్గించడం మొదలు పెట్టారు. F3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లు ఉంచారు. ఇక మేజర్ సినిమాకైతే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే తక్కువ ధరలకే టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. మరోవైపు OTT కూడా స్పీడ్ అందుకుంది. విడుదలైన వారం రోజులకే OTT లో స్ట్రీమింగ్ కు ఇచ్చేయడం లాంటివి జరిగాయి. దీంతో ప్రేక్షకులు థియేట్లకు దూరం అయ్యారు. అయితే తాజాగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలతో ప్రతీ సినిమాకు టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉందని టాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతోంది.