అనువాద చిత్రాలతోనే తెలుగువారిని ఆకట్టుకున్న మాధవన్, ఇప్పుడు స్ట్రెయిట్ మూవీస్ తోనూ మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ‘ఓం శాంతి’ తెలుగు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన మాధవన్, ‘సవ్యసాచి’, ‘నిశ్శబ్ధం’ చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించాడు. నటునిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకునిగానూ తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నంలో ఉన్నాడు మాధవన్.
రంగనాథన్ మాధవన్ 1970 జూన్ 1న జెమ్ షెడ్ పూర్ లో జన్మించాడు. ఆయన తండ్రి రంగనాథన్ తమిళనాడుకు చెందిన అయ్యంగార్. టాటా స్టీల్స్ లో మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా రంగనాథన్ పనిచేసేవారు. జెమ్ షెడ్ పూర్ లోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన మాధవన్, తరువాత ఓ యేడాది కెనడాలోనూ చదివారు. తరువాత కోల్హాపూర్ లో బి.ఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశారు. ఆ రోజుల్లోనే పలు ఆటల్లోనూ, నాటకాల్లోనూ పాల్గొంటూ ఎంతో హుషారుగా ఉండేవాడు మాధవన్. ఎన్.సి.సి. క్యాడెట్ గా ఇంగ్లండ్ సందర్శించిన మాధవన్ కు అక్కడే రాయల్ నేవీలో శిక్షణ ఇచ్చారు. ఆరు నెలలు వయసు ఎక్కువ కావడంతో ‘రాయల్ ఎయిర్ ఫోర్స్’లో చేరలేకపోయాడు మాధవన్. ‘పబ్లిక్ స్పీకింగ్’లో ఛాంపియన్ అనిపించుకున్నాడు మాధవన్. ముంబైలో ‘పబ్లిక్ స్పీకింగ్ కోర్సు’కు ట్యూటర్ గానూ పనిచేశాడు. అక్కడే ఆయన క్లాస్ కు అటెండ్ అయిన సరితా బిర్జేను ప్రేమించాడు. తరువాత పెళ్ళాడాడు. ఆపై సంతోష్ శివన్ తో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా మణిరత్నం ను కలుసుకున్నాడు. దాంతో సినిమాలపై ఆసక్తి కలిగింది. ‘ఇస్ రాత్ కీ సుభా నహీ’ అనే చిత్రంలో నైట్ క్లబ్ లో సింగర్ గా కనిపించాడు మాధవన్. ఆ తరువాత ‘ఇన్ ఫెర్నో’ అనే ఇంగ్లిష్ సినిమాలోనూ, ‘శాంతి శాంతి శాంతి’ అనే కన్నడ చిత్రంలోనూ నటించాడు. ఆ తరువాతే మణిరత్నం ‘అలై పయుతే’ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్ కొట్టేశాడు మాధవన్. ఈ సినిమా తెలుగులో ‘సఖి’గా విడుదలై ఇక్కడా విజయం సాధించింది.
గౌతమ్ వాసు దేవమీనన్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘మిన్నలే’ కూడా మాధవన్ కు హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమా తెలుగులో ‘చెలి’గా అనువాదమై ఆకట్టుకుంది. హిందీలో ఇదే సినిమా ‘రెహనా హై తేరే దిల్ మే’ పేరుతో రీమేక్ అయింది. అందులోనూ మాధవన్ హీరోగా మెప్పించాడు. మణిరత్నం ‘అమృత’, లింగుస్వామి ‘రన్’ అనువాద చిత్రాలు సైతం తెలుగునాట మాధవన్ కు మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. దాంతో మాధవన్ డబ్బింగ్ మూవీస్ కు తెలుగునాట కూడా మంచి ఆదరణ లభించసాగింది. ఉత్తరాదిన సైతం మాధవన్ కు నటుడుగా మంచి గుర్తింపు దక్కింది. ఆమిర్ ఖాన్ తో కలసి నటించిన ‘త్రీ ఇడియట్స్’, కంగనా రనౌత్ జోడీగా అలరించిన ‘తనూ వెడ్స్ మను’తో ఉత్తరాది ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాడు. ఇలా సాగుతున్న మాధవన్ కు సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘సాలా ఖధూస్’ కూడా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘గురు’ పేరుతో రీమేక్ అయింది. ‘ఓం శాంతి’ తెలుగు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు. ఆ పై నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సవ్యసాచి’లోనూ, అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్ధం’లోనూ విలక్షణమైన పాత్రలతో అలరించాడు మాధవన్.
నటుడిగానే కాదు, కథకుడిగా, నిర్మాతగా, దర్శకునిగానూ మాధవన్ సాగుతున్నాడు. ఏరో స్పేస్ ఇంజనీర్ ఎస్.నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ’ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటించాడు మాధవన్. త్వరలోనే ఈ సినిమా జనం ముందుకు రానుంది. “అమ్రిక్ పండిట్, ధోఖా రౌండ్ డి కార్నర్” అనే హిందీ చిత్రాలలోనూ మ్యాడీ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే మాధవన్ తనయుడు వేదాంత్ ప్రొఫెషనల్ స్విమ్మర్. డేనిష్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్ లో వేదాంత్ భారత్ అభ్యర్థిగా పాల్గొని సిల్వర్ మెడల్ సాధించాడు. దాంతో పుత్రోత్సాహంలో ఉన్న మాధవన్ త్వరలోనే ‘రాకెట్రీ’తో జనాన్ని పలకరించనున్నాడు. మరి ఈ సినిమాతో మాధవన్ ఏ తీరున ఆకట్టుకుంటాడో చూడాలి.