యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న సంగతి తెల్సిందే. శనివారం ఉదయం జూబ్లీ హిల్స్ రాడ్ నెం 36 లో ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని, కారుకు మూడు ఛలాన్‌లు వేసిన ట్రాఫిక్ పోలీసులు.. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.1,450 జరిమానా విధించారని వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్ అభిమానులు కొద్దిగా ఆందోళన చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని ప్రభాస్ పిఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
“ఈ రోజు హైదరాబాద్ రోడ్ నెంబర్ 36 లో ప్రభాస్ గారి కారు కి హైదరాబాద్ పోలీస్ వారు ఫైన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కారుకి, హీరో ప్రభాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదని తెలియచేస్తున్నాం. దయచేసి గమనించగలరు” అంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో వార్త అవాస్తవమని తెలుస్తుంది. వేరే కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని, అది ప్రభాస్ కారు అని పొరబడినట్లు వారు తెలుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నారని, త్వరలోనే ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.