యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్ 30 తెరకెక్కబోతున్న విషయం విదితమే . ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి తారక్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టర్.. సేమ్ టూ సేమ్.. అల్లు అర్జున్- శివ కొరటాల ప్రాజెక్ట్ పోస్టర్ లా ఉండడంతో ఈ సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. అల్లుఅర్జున్ 21 వ మూవీగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన విషయం విదితమే. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ వేశారు. కొరటాల- బన్నీ సముద్రంలో రెండు రాళ్లపై నిలబడి ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.
అల్లు అర్జున్ 20 వ సినిమాగా పుష్ప రిలీజ్ అయ్యింది.. ప్రస్తుతం పుష్ప 2 తో బన్నీ బిజీగా ఉన్నాడు. ఇప్పట్లో కొరటాలకు డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో ఈ సినిమాను బన్నీ రిజెక్ట్ చేసి ఉంటాడని, అదే కథను కొరటాల, ఎన్టీఆర్ కు వినిపించడం, ఆయన ఓకే చేయడంతో వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని కూడా యువసుధ ఆర్ట్స్ బ్యానరే నిర్మిస్తుండడం విశేషం.. కాకపోతే వీరితో పాటు నందమూరి ఆర్ట్స్ కూడా కలవడంతో మరింత హైప్ వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే బన్నీకి తగ్గట్టు కథను రాసుకున్న కొరటాల ఇప్పుడు తారక్ కు తగ్గట్టు కథలో ఏమైనా మార్పులు చేస్తున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. బన్నీ తో అనుకున్న రివెంజ్ డ్రామానే తారక్ తో తీస్తున్న కొరటాల ఎలాంటి హిట్ ను అందుకుంటాడా చూడాలి.