(డిసెంబర్ 23న కిసాన్ దివస్…)
‘రైతే దేశానికి వెన్నెముక’ అంటూ అనేక తెలుగు చిత్రాలలో కథలు చోటు చేసుకున్నాయి. రైతును రక్షించుకుంటేనే మన మనుగడ సాగుతుందనీ పలు చిత్రాలు చాటాయి. రైతుల కోసమే ప్రత్యేకంగా ‘కిసాన్ దివస్’ జరుపుకుంటున్నాం. ఇలా రైతుకు పట్టం కడుతూనే ఉన్నాం. రైతులకు రుణాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. కొన్ని రాష్ట్రాలలో రైతుల రుణాలను మాఫీ చేసేస్తూ, ఓట్లు పోగేసుకుంటున్నారు. మొన్నటి దాకా, కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవీనీకరణ రైతు సంస్కరణలపై ఉత్తరాది రైతులు అలుపెరుగని పోరాటమూ చేశారు. చివరకు కేంద్రం తమ ప్రయత్నాన్ని విరమించుకుంది. అందులో పూర్తి విరమణ సాగలేదని, అందువల్ల తమ పోరాటం ముందుకు సాగుతుందనీ రైతు నాయకులు అన్నారు. ఇలా రైతుభారతం సాగుతోంది. డిసెంబర్ 23న ‘కిసాన్ దివస్’ సందర్భంగా రైతులకు మన తెలుగు సినిమాలు ఎలాంటి విలువను ఇచ్చాయో గుర్తు చేసుకుందాం.
‘రైతుబిడ్డ’తోనే…
‘రైతే దేశానికి వెన్నెముక… ఆ రైతుకు రక్షణ కావాలి…’ అన్న నినాదం ఇప్పటిది కాదు. దేశస్వాతంత్య్రం రాకమునుపే 1939లో గూడవల్లి రామబ్రహ్మం ‘రైతుబిడ్డ’లో రైతుల జీవనవిధానాన్ని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు. ఈ సినిమాను ఆ రోజుల్లో జమీందార్లు పట్టుపట్టి, ప్రదర్శించరాదని బ్రిటీష్ వారి అండదండలతో నిషేధించారు. అయినప్పటికీ, ఈ చిత్రాన్ని చూడటానికి జనం బండ్లు కట్టుకొని మరీ వచ్చి పంటపొలాలో రహస్యంగా వేసిన ప్రదర్శనలు చూసి ఆనందించారు. తరువాత ధైర్యంగానే మరికొందరు థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాలో రైతులను ఆదుకోవాలనే భావంతో కొన్ని పాటలూ రూపొందాయి. “రైతుపైన అనురాగం చూపని…” పాట ఆ రోజుల్లో భలేగా ఆకట్టుకుంది. “నిద్రమేలుకోరా తమ్ముడా…గాఢ నిద్ర మేలుకోరా…”, “రైతుకే ఓటివ్వ వలెనన్నా…” వంటి పాటలు విశేషాదరణ చూరగొన్నాయి.
కథల్లో రైతులు…
‘రైతు బిడ్డ’ సాధించిన సంచలన విజయం తరువాత వచ్చిన నిర్మాతలను ఎంతగానో ఆలోచింప చేసింది. దాంతో ఏదో విధంగా తమ చిత్రాలలో రైతుల సమస్యలను ప్రత్యేకంగా చొప్పించి, తగిన పరిష్కారాలు చూపించే ప్రయత్నం చేశారు కొందరు. అనేక జనరంజకమైన చిత్రాలను నిర్మించిన ‘విజయా ప్రొడక్షన్స్’ సంస్థ తమ తొలి సినిమా ‘షావుకారు’లోనూ రైతుల సమస్యలను చొప్పించారు. ఇక యన్టీఆర్, ఏయన్నార్ తొలిసారి కలసి నటించిన ‘పల్లెటూరి పిల్ల’ జానపదంలోనూ దొంగల్లోనే మార్పు తీసుకువచ్చే పల్లె రైతుల జీవన చిత్రణ సాగింది. ఇక సావిత్రి తొలిసారి నాయికగా నటించిన ‘పల్లెటూరు’లోనూ రైతుల జీవనవిధానం చూపించారు. ఇందులో హీరో యన్టీఆర్, రైతులకు నవీన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే రీతిని బోధించడం ప్రధానాంశం. రైతు కూలీల జీవనవిధానాన్ని చూపిస్తూ ‘రోజులు మారాయి’లో కథ సాగుతుంది. రైతులకు ఎంతో ముఖ్యమైన ‘ఏరువాక పున్నమి’న నేలను దున్నడానికి పోయే రైతులకు శుభం కలిగేలా సాగిన “ఏరువాకా సాగాలో రన్నో చిన్నన్నా…” పాట ఈ నాటికీ రైతులకు ఆనందం పంచుతూనే ఉంది. తెలుగువారి తొలి రంగుల చిత్రం అయిన పౌరాణిక గాథ ‘లవకుశ’లోనూ “రామన్న రాముడూ… కోదండరాముడూ…” పాటలో “నెల మూడు పంటలు పండేను…” అంటూ వ్యవసాయాన్ని గుర్తు చేశారు. తరువాత సీతాపరిత్యాగం తరువాత పంటలు పండక జనం కష్టాలు పడుతున్నారనీ తెలిపారు. ఇలా జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లోనూ రైతుల సమస్యలను ఏదో విధంగా చర్చించడం పరిపాటిగా మారింది.
అలరించిన రైతుల పాటలు
ఆ రోజుల్లో రామారావు, నాగేశ్వరరావు అనేక పల్లెవాతావరణం నేపథ్యంలో రూపొందిన చిత్రాలలో నటించారు. వారి చిత్రాల్లోని పాటలూ రైతులకు ఉత్సాహం ఇచ్చి ఉరకలు వేయించేవి. “పొలాలనన్నీ హలాల దున్నీ…” అనే శ్రీశ్రీ గీతాన్ని అనువుగా ‘పల్లెటూరు’లో ఉపయోగించుకున్నారు. ‘రోజులు మారాయి’లో పంటలు నూర్పులు పట్టే సమయంలో “ఒలియో ఒలియో ఒలీ…” పాట అలరించింది. ఇక ‘తోడికోడళ్ళు’లోని “ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే…” అనే పాట సన్నకారు రైతులకు మరింత ఉత్సాహం నింపింది. “ఎండా వానా గాలి వెన్నెల ఏమన్నాయిరా…” (కదలడు-వదలడు), “రైతే రాజ్యం ఏలాలి… ఈ రైతుకు రక్షణ కావాలి…” (రైతుబిడ్డ), “పట్టండి నాగలి పట్టండి…” (కలిసొచ్చిన అదృష్టం), “ఓహో రైతన్నా…ఈ విజయం నీదన్నా…” (విజయం మనదే), “నా దేశం కోసం నడుం బిగించి… నాగలి పట్టానోయ్…” (పెత్తందార్లు), “పట్టాలి అరక… దున్నాలి మెరకా…” (చిట్టిచెల్లెలు), “ఎవడిదిరా ఈ భూమి…ఎవ్వడురా భూస్వామి… దున్నేవాడిదే భూమి, పండించేవాడే ఆసామీ…” (మనుషులంతా ఒక్కటే), “దేశమంటే మట్టికాదోయ్…దేశమంటే మనుషులోయ్…” (చండశాసనుడు), “రైతు మేడిపట్టి సాగలేరా లోకము…” (నమ్మినబంటు), “ఈ మట్టిలోనే పుట్టాము…” (రైతుకుటుంబం), “ఈ రోజు సంక్రాంతి అసలైన పండగ…” (మంచిరోజులొచ్చాయి), “మనజన్మభూమి… బంగారు భూమి…” (పాడిపంటలు), “పొంగింది పొంగింది బంగారు భూమి…” (బంగారుభూమి), “భూమికి పచ్చనీ రంగేసినట్టు…” (శ్రీరాములయ్య)- ఇలా అనేక పాటలు రైతుల జీవనచిత్రాలను మన కళ్ళముందు ఉంచాయి.
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విశేషంగా చోటు చేసుకున్న రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలు, రైతు పాటలు అన్నవి ప్రస్తుతం తరిగిపోయాయనే చెప్పాలి. నవీన విధానాలతో పంటలు పండించవచ్చునని చాటుతూ ఈ మధ్య వచ్చిన ‘మహర్షి’లోని కథ, కథనం రైతులను ఆకట్టుకున్నాయి. అందులోని “పదర పదరా…నీ అడుగుకు పదను పెట్టి పదరా…” పాట భలేగా మురిపించింది. మునుముందు కూడా ఇలాంటి ఇతివృత్తాలు, పాటలు రైతులకు ఉత్సాహం కలిగిస్తూ మన చిత్రాలలో చోటు చేసుకుంటాయని ఆశిద్దాం.