Sivam Celluloids: కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ఈ తరం హీరోలలో ముందుంటాడు కిరణ్ అబ్బవరం. తన సినిమాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా టాలెంట్ ఉంటే చాలు… నూతన దర్శకులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అతని తొలి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో రవికిరణ్ కోలా పరిచయం కాగా, ఆ తర్వాత వరుసగా శ్రీధర్ గాదె, బాలాజీ సయ్యపురెడ్డి, గోపీనాథ్ రెడ్డి, మురళీ కిశోర్ అబ్బూరు లను దర్శకులుగా పరిచయం చేశాడు. మురళీ కిశోర్ తీసిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఇప్పుడు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. అలానే ఏప్రిల్ 7న రాబోతున్న ‘మీటర్’ మూవీతో రమేశ్ కడూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ రిలీజ్ కు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. అలానే ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలోనూ కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో సినిమాకు శ్రీకారం చుట్టేశాడు. దీని ద్వారానూ కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ పరిచయం అవుతున్నాడు.
శివం సెల్యులాయిడ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్-2గా ఒక సరికొత్త లవ్ యాక్షన్ డ్రామా రూపొందనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో గురువారం ఘనంగా జరిగింది. హీరో కిరణ్ అబ్బవరంపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఎ. ఎం. రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు కె. ఎస్. రామారావు, జెమిని కిరణ్, శిరీష్, వల్లభనేని వంశీ, నల్లమలపు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోదర ప్రసాద్, కె. కె. రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు హాజరై సినిమా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీకి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్. స్వర రచన చేయబోతున్నాడు.