కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషితో హీరో కిచ్చా సుదీప్ భేటీ అయ్యారు. సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు అరబిక్, జర్మన్, రష్యన్, మాండ్రిన్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది. దీనిని హిందీలో సల్మాన్ ఖాన్ తో కలసి పివిఆర్ సంస్థ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండే శనివారం 12 సంవత్సరాల తర్వాత సినిమా ప్రచారం కోసం ఢిల్లీ వెళ్ళిన కిచ్చా సుదీప్ ను కర్ణాటక లోని ధార్వాడ్ నుంచి ఎం.పిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషి అల్పాహార విందుకు ఆహ్వానించారు. సుదీప్ తో పాటు రమాండా దేశ కాన్సులేట్ సురేశ్ మోహన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుదీప్ ను ‘విక్రాంత్ రోణ’ గురించి ఆ సినిమా ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రి ప్రహ్లాద్ జోషి. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఫాంటసీ యాక్షన్ ఎడ్వెంచర్ మూవీగా ఈ ‘విక్రాంత్ రోణ’ తెరకెక్కింది. కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్ సంస్థలు నిర్మించిన ఈ మూవీలో సుదీప్ తో పాటు నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్విలన్ ఫెర్నాండెజ్ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించిన ఈ సినిమాకు అనూప్ భండారి దర్శకత్వం వహించారు.