మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఖిలాడీ’. గతంలో పదేళ్ళ క్రితం రవితేజతోనే రమేశ్ వర్మ ‘వీర’ చిత్రం రూపొందించాడు. రెండు పాటలు మినహా పూర్తయిన ‘ఖిలాడీ’ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసిన భారీ సెట్ లో డిసెంబర్ 13 నుండి రవితేజ, మీనాక్షి చౌదరిపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిసున్న ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. బాలెన్స్ ఉన్న మరో పాటను కూడా అతి త్వరలోనే పూర్తి చేసి, ముందు అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 11న మూవీని విడుదల చేస్తామని నిర్మాత కోనేరు సత్యనారాయణ చెబుతున్నారు.
పాట చిత్రీకరణకు సంబంధించి మానిటర్ లో కనిపించే విజువల్ ను ఫోటో తీసి దర్శకుడు రమేశ్ వర్మ సోషల్ మీడియాలో పెట్టాడు. రవితేజతో కలిసి ఈ పాటలో డాన్స్ చేయడం ఆనందంగా ఉందని మీనాక్షి చౌదరి తెలిపింది. ‘ఖిలాడీ’ చిత్రంలో మరో నాయికగా డింపుల్ హయతి నటిస్తోంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు.