‘కేజీఎఫ్ -2’ సినిమా చూసి, ఎండ్ టైటిల్స్ పడగానే థియేటర్ల నుండి బయటకు వచ్చేవారు ఓ ఆసక్తికరమైన అంశాన్ని మిస్ అయినట్టే! ‘కేజీఎఫ్ -3’కి సంబంధించిన విశేషం… ఎండ్ స్క్రోలింగ్ టైటిల్స్ తర్వాతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశాడు. నిజానికి ‘కేజీఎఫ్’ చిత్రాన్ని చాప్టర్ 1, చాప్టర్ 2 గానే తీయాలని దర్శక నిర్మాతలు భావించారు. చాప్టర్ 1 సమయంలోనే 2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఇక్కడ ‘బాహుబలి’ తరహాలో, అక్కడ ప్రథమ భాగానికి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని బాలెన్స్ ఉన్న పార్ట్ ను భారీ స్థాయిలో చిత్రీకరించారు. సంజయ్ దత్ పోషించిన అధీరా పాత్ర, రవీనాటాండన్ నటించిన ప్రధాని పాత్ర అంత గ్రాండ్ గా పిక్చరైజ్ చేయడానికి ‘కేజీఎఫ్ 1’ కు వచ్చిన స్పందనే కారణం. తొలుత రెండు భాగాలకే కమిట్ అయిన ఈ చిత్ర బృందం చాప్టర్ 2కు బిజినెస్ పరంగా వచ్చిన హైప్ ను దృష్టిలో ఉంచుకుని ‘కేజీఎఫ్’ అనే బ్రాండ్ నేమ్ ను ట్రంప్ కార్డ్ గా ఉపయోగించుకోవాలని భావించింది. అందుకే ‘కేజీఎఫ్ -3’కి సంబంధించిన ప్రకటన చేసిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : Akshay Kumar : షారుఖ్, అజయ్ లతో కలిసి యాడ్… ఏకిపారేస్తున్న నెటిజన్లు
ఏ హీరో, ఏ డైరెక్టర్ కైనా కెరీర్ లో ‘కేజీఎఫ్’ లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ దొరకవు. సో… అలా ఊహించకుండా వచ్చిన క్రేజ్ కు ఫుల్ స్టాప్ పెట్టకుండా కామా పెడితే, నియర్ ఫ్యూచర్ లో కెరీర్ డోల్ డ్రమ్స్ లోకి వెళితే… దానిని ఉపయోగించుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్క వచ్చన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. అందుకే… ముందు అనుకున్నట్టు రెండు భాగాలతో సంతృప్తి పడకుండా… మూడో భాగమూ ఉంటుందని ఊరిస్తున్నారు! అయితే వాస్తవం ఏమంటే… అది వెంటనే ఉండదు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ కమిట్ అయిన సినిమాలు మూడు నాలుగు ఉన్నాయి. చిత్రం ఏమంటే… ‘కేజీఎఫ్’ తర్వాత అతనికి శాండిల్ ఉడ్ లో కంటే… టాలీవుడ్ లోనే డిమాండ్ ఏర్పడింది. తెలుగు స్టార్ హీరోలు, టాప్ ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ నీల్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సెట్స్ పై ఉన్న ‘సలార్’ను పూర్తి చేయడంతో పాటు ఎన్టీయార్, రామ్ చరణ్ తోనూ ప్రశాంత్ మూవీస్ చేయాల్సి ఉంది. ఇవన్నీ అయిన తర్వాతే ‘కేజీఎఫ్ -3’ ఉంటుందని, దాన్ని అవసరం వచ్చినప్పుడు వాడుకునే పాశుపతాస్త్రంగా ఈ చిత్రం బృందం భావిస్తోందని సన్నిహితులు చెబుతున్నారు. మరి ‘కేజీఎఫ్ -3’ మూడేళ్ళకు వస్తుందా… నాలుగేళ్ళకు వస్తుందా అనేది వేచి చూడాలి.