మలయళ హీరో దిలీప్ వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోటులు ఎదుర్కొంటున్నా, నటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను నటించిన ‘మై శాంటా’ 2019 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా వచ్చింది. ఇప్పుడు రెండేళ్ళ తర్వాత ‘కేశు ఈ వీడిండే నాథన్’ మూవీ డిసెంబర్ 31న రిలీజ్ అయ్యింది. తొలుత దీన్ని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా, కరోనా కారణంగా నిర్మాతలు మనసు మార్చుకుని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేశారు. విశేషం ఏమంటే… దిలీప్ చిరకాల మిత్రుడు నాదిర్షా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దిలీప్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు.
కేశు (దిలీప్) కేరళలోని ఓ చిన్న పట్టణంలో డ్రైవింగ్ స్కూల్ నిర్వహింస్తుంటాడు. డ్రైవింగ్ నేర్పడంలో దిట్ట అయిన కేశుకు తన ఇంటి నిర్వహణ మాత్రం ఇబ్బందిగా మారుతుంది. తండ్రి అకాల మరణంతో చెల్లెళ్ల పెళ్ళిళ్ళు చేసి అప్పులపాలవుతాడు. అయితే తనకొచ్చే ఆదాయంతో కూతురిని, కొడుకునూ బాగానే చదివిస్తుంటాడు. ఇదే సమయంలో ఉమ్మడి ఆస్తిని అమ్మి తమ వాట ఇవ్వమని కేశు చెల్లెళ్ళు, బావలు ఒత్తిడి చేస్తుంటారు. అందుకు కేశు ససేమిరా అంటాడు. తండ్రి ఆస్తి గురించి కొడుకు, కూతుళ్ళు తగువులాడుకోవడం చూసిన తల్లి, ”మీ నాన్న తన అస్తికలు రామేశ్వరంలో కలపమని కోరారు. దానిని తీర్చే తీరిక మీకు లేదు కానీ ఆయన ఆస్తి కావాల్సి వచ్చిందా?” అంటూ చురకలు వేస్తుంది. దాంతో తండ్రి కోరికను నెరవేర్చడం కోసం కేశు, అతని చెల్లెళ్ళు కుటుంబాలతో కలిసి ఓ ప్రైవేట్ బస్సులో రామేశ్వరం బయలు దేరతారు. అంతవరకూ కథ బాగానే ఉంది. దారి మధ్యలో కేశుకు ఏకంగా 12 కోట్ల రూపాయల లాటరీ తగిలిందని ఫోన్ వస్తుంది. అక్కడ నుండి కథ చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతుంది. హఠాత్తుగా మనిషికి డబ్బు జబ్బు పట్టుకుంటే, అతని ఆలోచనా విధానం ఎలా ఉంటుందనేదే మిగతా కథ.
దిలీప్ కు కామెడీ చిత్రాలు చేయడం కొత్తకాదు. అయితే కాస్తంత విరామం తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీని చేశాడు. యాభై నాలుగేళ్ళ దిలీప్ తన వయసుకు తగ్గ పాత్రనే పోషించినా, మధ్య తరగతి వాడిగా కనిపించడం కోసం మేకోవర్ చేశాడు. గుండు కొట్టించుకుని, పల్చటి జత్తుతో విగ్గు పెట్టుకున్నాడు. మందపాటి కళ్ళజోడుతో పాటు కాస్తంత ఒళ్ళు చేసి కేశు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అక్కడక్కడా అతని నటన కాస్తంత అతిగా ఉంది. అయితే, ఆ పాత్ర స్వభావాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే బాగానే చేశాడనిపిస్తుంది. ముఖ్యంగా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ సిగ్నల్ సరిగా అందకపోవడంతో అలా ఇంటి నుండి బయటకు వచ్చేయడం, అలానే స్నానాల గదిలోంచి రోడ్డు మీదకు వచ్చేయడం వంటి సన్నివేశాలు అతిగా ఉన్నా, వినోదాన్ని పండించాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి బస్సులో తీర్థయాత్రకు బయలు దేరినప్పుడు వెనక సీటులో పేకాట సిట్టింగ్, మందు సర్వ్ చేసుకోవడం వంటివి నేచురల్ గా ఉన్నాయి. బస్సు కిటికీ లోంచి బయటకు చూస్తున్న కొత్త పెళ్లి కొడుకు విగ్గు ఎగిరిపోవడం, నవదంపతుల సరసాలు, లవర్స్ ఇచ్చుకునే సిగ్నల్స్… ఇవన్నీ కథాగమనంలో భాగమైపోయాయి. మిస్ అయిన లాటరీ టిక్కెట్ ను వెదికే క్రమంలో జరిగే నాటకీయ పరిణామాలూ వినోదాన్ని పండిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు కాగా క్లయిమాక్స్ లో పోయిందనుకున్న లాటరీ టికెట్ కేశు చేతికి చిక్కడం గొప్పగా ఉంది.
కేశుగా దిలీప్ బాగా చేశాడు. ముఖ్యంగా పెక్యులర్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. అతని భార్య రత్నమ్మగా ఊర్వశి చక్కగా నటించింది. ఇలాంటి పాత్రలు చేయడం ఆమెకు కొట్టిన పిండి. ఊర్వశిని తప్ప మరెవరినీ ఆ పాత్రలో ఊహించుకోలేం. ఇతర పాత్రలలో వైష్ణవి వేణుగోపాల్, కళాభవన్ షాజోన్, హరీశ్ కనరన్ తదితరులు కనిపిస్తారు. దిలీప్ తో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న నాదిర్ష… తొలిసారి తన స్నేహితుడిని డైరెక్ట్ చేశాడు. పైగా దీనికి దిలీప్ నిర్మాతగానూ వ్యవహరించడంతో పాత్రనే కాకుండా మూవీని సైతం సహజంగానే ఓన్ చేసుకున్నాడు. నాదిర్షానే ఇందులోని రెండు పాటలనూ రాసి, స్వరపరిచాడు. వీటిలో ఒకదానిని కె.జె. ఏసుదాసు పాడగా, మరో దానిని హీరో దిలీప్ పాడాడు. సజీవ్ పజూర్ రాసిన కథను అనిల్ నాయర్ తన కెమెరాపనితనంతో చక్కగా తెరపై ఆవిష్కరించాడు. మలయాళం తెలియకపోయినా… ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని సరదాగా చూసేయొచ్చు. మధ్యతరగతి మనుషుల మనస్తత్వానికి అద్దంపట్టే ఈ ఫ్యామిలీ డ్రామా అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా టైటిల్స్ సమయంలో దిలీప్ తన పాత్రను తానే పోషిస్తూ, ఈ సినిమా గురించి వివరణ ఇవ్వడం బాగుంది.
ప్లస్ పాయింట్స్
వినోదానికి పెద్దపీట
నటీనటుల సహజ నటన
నాదిర్షా సంగీతం, దర్శకత్వం
మైనెస్ పాయింట్స్
కాస్తంత అతిగా అనిపించే సీన్స్
ఫ్లోని అడ్డుకునే నాటకీయత
రేటింగ్: 2.75 / 5
ట్యాగ్ లైన్ : లాటరీ తగిలింది!