Mandya Ravi: చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు ప్రేక్షకులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే. ఇంకా ఆ వార్తను జీర్ణించుకోలేకపోతుంది ఇండస్ట్రీ.. ఈ నేపథ్యంలో మరో సీనియర్ నటుడు మృతి చెందడం షాక్ కు గురిచేస్తోంది. ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి మృతి చెందాడు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రవి ప్రసాద్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశాడు.
కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. అప్పట్లో టీవీలో వచ్చిన పలు సీరియల్స్ లో రవి కనిపించి మెప్పించాడు. ప్రముఖ రచయిత హెచ్ ఎస్ ముద్దె గౌడ కుమారుడే రవి ప్రసాద్. మహామయి అనే టీవీ సీరియల్ తో ఫేమస్ అయిన రవి.. చిత్రలేఖ, వరలక్ష్మీ, యశోద వంటి సీరియల్స్ లో నటించి మెప్పించాడు. ఇక రవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఈ వరుస మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.