కన్నడ హీరో దిగంత్ మంచలే ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల భార్యతో గోవా ట్రిప్ కు వెళ్లిన ఆయన బీచ్ లో జంప్ చేస్తూ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో దిగంత్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అతనిని దగ్గర్లోని మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. వైద్యులు మెరుగైన చికిత్స చేయాలని చెప్పడంతో వెంటనే అతనిని బెంగుళూరు కు తరలించినట్లు సమాచారం. దిగంత్ కన్నడలోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితుడే .. ‘వాన’ చిత్రంలో సెకండ్ హీరోగా నటించాడు. చివర్లో మీరాచోప్రాను పెళ్లి చేసుకోవడానికి వచ్చే జవాన్ గా నటించింది దిగంతే.
ఇక ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించిన దిగంత్ ‘గాలిపాట’. హౌస్ ఫుల్ వంటి చిత్రాలతో పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో తెలుగులో భారీ విజయం అందుకున్న ‘ఎవరు’ చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు. అడివి శేష్ పాత్రలో దిగంత్ నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే అతడికి ఇలా జరగడం బాధాకరమైన విషయమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.