విలక్షణమైన అభినయానికి నిలువెత్తు నిదర్శనం కమల్ హాసన్. కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా కమల్ అభినయాన్ని అభిమానించేవారి సంఖ్య లెక్కలేనిది. ఆరు పదులు దాటి అర్ధపుష్కరమైనా, ఇప్పటికీ కమల్ హాసన్ లో మునుపటి ఉత్సాహం, అదే తపన, ఎప్పటిలా ఓ విద్యార్థిలా నేర్చుకోవడం అన్నవి కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాట జన్మించి, అక్కడ స్టార్ హీరోగా రాజ్యమేలినా, తెలుగునేలపైనే కమల్ కు అత్యధిక సంఖ్యలో అభిమానులున్నారని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా మూడు సార్లు నిలచిన తొలి నటుడుగా కమల్ హాసన్ చరిత్ర సృష్టించారు. అంతకు ముందే మూడు సార్లు నంది అవార్డు అందుకున్న మొదటి నటునిగానూ కమల్ ఓ రికార్డ్ సొంతం చేసుకున్నారు. దీనిని బట్టే తెలుగువాళ్ళకు కమల్ హాసన్ అభినయం అంటే ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. కమల్ నటించిన పరభాషా చిత్రాలను సైతం తెలుగువారు ఎంతో ఇష్టంగా, ఆరాధనగా చూస్తూ ఉంటారు. అదీ ఆయనపై ఇక్కడివారికి ఉన్న విశేషాదరణ.
కమల్ హాసన్ నటనలో అతి ఉంటుందనే విమర్శలు ఉండేవి. వాటిని మరిపించి, ఆయనలోని అసలైన నటునికి పట్టాభిషేకం చేశారు దర్శకుడు బాలు మహేంద్ర. ‘మూండ్రం పిరై’లో కమల్ అభినయం ఆయనకు తొలి నేషనల్ అవార్డును సంపాదించి పెట్టింది. ఈ చిత్రం తెలుగులో ‘వసంతకోకిల’గా అనువాదమై అలరించింది. ఆ తరువాత మణిరత్నం ‘నాయకుడు’ కూడా కమల్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డును సంపాదించి పెట్టింది. కమల్ హాసన్ తో శంకర్ తెరకెక్కించిన ‘ఇండియన్’తో మూడోసారి జాతీయ ఉత్తమనటుడు అనిపించుకున్నారు కమల్. ఆయనకు నేషనల్ అవార్డ్స్ లభించినప్పుడూ కొన్ని విమర్శలు వినిపించాయి. అప్పట్లో నేషనల్ అవార్డ్స్ జ్యూరీలో కమల్ అన్న చారూ హాసన్ ఉన్నారు కాబట్టే, ఆయనకు జాతీయ అవార్డులు లభించాయనీ అన్నారు. అయితే ‘భారతీయుడు’తో కమల్ నేషనల్ అవార్డు అందుకున్న సమయంలో మాత్రం ఆయన అన్న అందులో లేరు. ఇప్పుడేమంటారు? అంటూ అభిమానులు విమర్శించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలుగులో కమల్ హాసన్ తొలి చిత్రం ‘అంతులేని కథ’. అందులో చిన్న పాత్రలో కనిపించిన కమల్, తరువాత ‘మరో చరిత్ర’లో కథానాయకునిగా అలరించారు. ఈ తెలుగు సినిమా ఏకంగా మద్రాసులో 75 వారాలు ప్రదర్శితమైంది. ఇక తెలుగులో కమల్ నటించిన ‘సాగరసంగమం, స్వాతిముత్యం’ చిత్రాలు తెలుగునాటనే కాదు, కన్నడ నాట సైతం ఎంతగానో అలరించాయి. ఈ రెండు చిత్రాలతో నంది అవార్డులు సొంతం చేసుకున్న కమల్ హాసన్ ‘ఇంద్రుడు-చంద్రుడు’లో తన విలక్షణమైన నటనతో మరో నందినీ తీసుకుపోయారు. 1984లో జరిగిన ‘మంగమ్మగారి మనవడు’ శతదినోత్సవంలో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సమయంలో ‘తాను తెలుగువాడిగా పుట్టనందుకు బాధపడుతున్నానని’ తెలుగుపై తనకున్న అభిమానం చాటుకున్నారాయన. కమల్ కీర్తి కిరీటంలో అనేక అవార్డులూ రివార్డులూ మేలి రత్నాలుగా వెలుగుతున్నాయి. అయితే ఆయన ముక్కుసూటి తనం మాత్రం కొందరికి కొరకరాని కొయ్యగానే మిగిలింది. అందుకే కాబోలు రాజకీయాల్లో కమల్ హాసన్ పరాజయం పాలయ్యారనిపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికీ తమ అభిమాన నటుడు చలన చిత్రాల్లో అలరిస్తూనే ఉంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. త్వరలో ‘విక్రమ్’ సినిమాతో జనాన్ని పలకరించబోతున్నారు కమల్. అలాగే మునుముందు వైవిధ్యంతోనే సాగే ప్రయత్నంలో ఉన్నారాయన. ఇంకా ఏయే పాత్రలతో కమల్ హాసన్ మురిపిస్తారో చూడాలి.