సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’లో కొత్తగా విడుదలైన “కళావతి…” పాట ఆ చిత్రానికే కొత్త కళ తెచ్చిందని చెప్పవచ్చు. థమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్ రాసిన పాట ఇది. దీనిని సిధ్ శ్రీరామ్ గానం చేశారు. పాట ఆరంభంలో మంగళకరమైన మంగళసూత్రధారణ సమయంలో వల్లించే మంత్రాన్ని వినిపించడం విశేషం! మరి ఆ మంత్రాన్ని ఎందువల్ల ఉపయోగించ వలసి వచ్చిందో సినిమా చూడాల్సిందే. “వందో ఒక వెయ్యో…ఒక లక్షో… మెరుపులు మీదికి దూకినాయా…” అంటూ ఈ పాట మొదలవుతుంది. తరువాత “కమాన్ కమ్మాన్ కళావతి…” అంటూ పాట ఊపందుకుంటుంది.
పాటలోని విజువల్స్ లో మహేశ్ బాబు, నాయిక కీర్తి సురేశ్ ఇద్దరూ గతంలో కన్నా కాస్త నాజూగ్గా కనిపిస్తారు. ప్రేమలోనూ, భక్తిలోనూ నిందాస్తుతి అన్నది కూడా భాగమే! ఈ పాటలో “అన్యాయంగా మనసును కెలికావే… అన్నం మానేసి నిన్నే చూసేలా… దుర్మార్గంగా సొగసును విసిరావే… నిద్ర మానేసి నిన్నే తలచేలా…” అంటూ అనంత్ శ్రీరామ్ భలేగా నిందాస్తుతి చేశారు. దీనిని బట్టి చిత్రంలో కథానాయకుడు, కథానాయికకు ప్రేమపూజారి అని ఇట్టే తెలిసిపోతోంది. “చించి… అతికించి… ఇరికించి… వదిలించి… నా బతుకును చెడగొడితివి కదవే…” అంటూ మరి కొన్ని పదవిన్యాసాలు సైతం వినిపిస్తాయి. మహేశ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా శేఖర్ విజే మాస్టర్ కొరియోగ్రఫీ సాగింది. ఈ పాటకు నృత్యభంగిమలు సమకూర్చిన శేఖర్ తప్పకుండా మహేశ్ అభిమానుల జేజేలు అందుకుంటారని చెప్పవచ్చు. అయితే ఎందుకనో హీరోను నడిపిన తీరు, కొన్ని భంగిమల్లో కూర్చోబెట్టిన శైలి చూస్తే ‘అల…వైకుంఠపురములో’లోని “నీ కాళ్ళను పట్టుకు…” పాట గుర్తుకు రాకమానదు అనిపిస్తుంది.
గతంలో థమన్ బాణీల్లో రూపొందిన ‘అల.. వైకుంఠపురములో’లోని స్వరాల పోకడ ఈ పాటలోనూ వినిపిస్తుంది. పైగా సిధ్ శ్రీరామ్ పాడడం వల్ల కాబోలు విన్నవారికి అదే ధ్యాస కలుగక మానదు. ఈ మ్యూజిక్ వీడియోలో సంగీత దర్శకుడు థమన్, గాయకుడు సిధ్ శ్రీరామ్, సంగీత కళాకారులు సైతం సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించడం విశేషం! ఈ పాటకు పద్మశ్రీ హరిద్వారమంగళం పళనివేల్ తబల, తాళం వీద, కంజీరా ను కంజీరా ఇసైమణి హరిహర శర్మ, నాదస్వరం భరతదాసన్, మంజునాథ్ సమకూర్చారు. ఈ పాటకు ప్రముఖ గాయకుడు శ్రీకృష్ణ వోకల్ సూపర్ వైజేషన్ చేయగా, గీతామాధురి, రమ్య బెహెరా, మోహన భోగరాజు, సాహితీ చాగంటి, పద్మజా శ్రీనివాసన్, లవిటా లోబో, వృష బాలు, రేష్మా శ్యామ్ వంటి వారు కోరస్ పాడడం విశేషం!
మైత్రీ మూవీస్, 14 రీల్స్, ఎమ్.బి. ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ను నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి మధి, మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ ని సమకూర్చారు. మే 12న విడుదల కానున్న ‘సర్కారు వారి పాట’లో ఈ ‘కళావతి…’ పాట మరెంతగా మురిపిస్తుందో చూడాలి.