Ravi Teja: వారసుల ఫిల్మ్ ఎంట్రీకి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ పీత కష్టాలు పీతవి…సీత కష్టాలు సీతవి! తండ్రి పేరున్న నటుడైనా, నిర్మాతైనా, దర్శకుడైనా… మొదటి సినిమా వరకూ హీరోకు కాస్తంత దన్ను లభిస్తుంది కానీ యాక్టర్ గా నిరూపించుకుని ఈ రంగంలో నిలబడాల్సింది అతనే! ఇదే సమయంలో కొత్త హీరోల మీద లేని ఎక్స్ పెక్టేషన్స్ వారసుల మీద ఉంటాయి. వాటిని అందుకోవడం కూడా అంత సులువు కాదు. ఇదిలా ఉంటే… అలాంటి వారసులు సైతం హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి నానా కష్టాలూ పడుతూనే ఉన్నారు. కొందరు మొదటి సినిమాకే మూటముల్లే సర్థుకుని వెళ్ళిపోతే… మరి కొందరికి ఎంట్రీనే చాలా కఠినంగా మారిపోతోంది. ఆ జాబితాలోకే చేరాడు మాస్ మహరాజా రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ భూపతి రాజు. మాధవ్ హీరోగా ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ ఇప్పటికే ఓ సినిమా ప్రారంభించాడు. ఈ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ‘ఏయ్.. పిల్లా’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. 90ల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని, దీనితో దర్శకుడిగా లూధీర్ బైరెడ్డిని పరిచయం చేస్తున్నామని, కథను రమేశ్ వర్మ అందించాడని తెలిపారు.
గత యేడాది ప్రకటితమైన ‘ఏయ్ పిల్లా’ సినిమా ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు మాధవ్ భూపతిరాజు హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. దీనికి ఆ మధ్య వచ్చిన శ్రీకాంత్ తనయుడు రోహన్ హీరోగా నటించిన ‘పెళ్ళిసందడి’ ఫేమ్ గౌరీ రోనంకి దర్శకత్వం వహించబోతోంది. జె.జె.ఆర్. ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యలమంచి రవి ఈ మూవీ నిర్మిస్తున్నాడు. గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కె. రాఘవేంద్రరావు, సురేశ్ బాబు, చదలవాడ శ్రీనివాసరావు, బెక్కెం వేణు, సాయి సౌజన్య తదితరులు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.